Karreguttalu Latest News: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్‌లో మావోయిస్టులకు రహస్య స్థావమైన కర్రెగుట్టలపై దేశవ్యాప్తం చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే మావోయిస్టులను ఎలిమినేట్ చేసి ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరేశామని భద్రతాబలగాలు చెబుతున్నాయి. మావోయిస్టుల అంతమే ధ్యేయంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. తమ అస్తిత్వమే ప్రమాదంలో పడటంతో మావోయిస్టులు శాంతి వచనాలు పలుకుతున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని అంటున్నాయి. ప్రత్యేకంగా శాంతి కమిటీని ఏర్పాటు చేసిమరీ చర్చలకు పిలవాలని అభ్యర్థిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. నా ఆర్ నెవర్ అన్నట్టు  అన్నట్టు దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేస్తోంది. 

Continues below advertisement


పరిస్థితులు ఇలా ఉన్న వేళ శాంతి కమిటీలో కీలక సభ్యులు, కర్రెగుట్టలలో అణువణువూ తెలిసిన మావోయిస్టు మాజీ కేంద్రకమిటీ సభ్యుడు జంపన్నను ఏబీపీ దేశం పలకరించింది. ఇప్పుడు కేంద్రం ఏం చేయాలని మావోయిస్టులు ఏం చేసి ఉంటారనే విషయాలపై ప్రశ్నించింది. 


ABP దేశం: కర్రెగుట్టల లోపల ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి. బంకర్లలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు.?


జంపన్న, మాజీ కేంద్రకమిటీ సభ్యుడు: అధికారికంగా ఇప్పటివరకూ కర్రెగుట్టలలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరూ చెప్పలేదు. గత కొద్ది రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అన్నీ స్పష్టతలేని కథనాలే. ఇప్పటికే అక్కడున్న మావోయిస్టులను చంపేసి బయటపెట్టకుండా ఉన్నారనే అనుమానాలున్నాయి. కర్రెగుట్టలలో ఉంటే యాభై లేదా అరవై మంది మాత్రమే మావోయిస్టులు ఉంటారు. వేలల్లో మావోయిస్టు దళాలు లేవు. కేవలం అన్నీ పుకార్లు మాత్రమే. పదివేలకుపైగా బలగాలు చుట్టుముట్టినప్పుడు , మావోయిస్టులు గుట్టను ఖాళీ చేసి ఇప్పటికే వెళ్లిపోయి ఉంటారు. ఒకవేళ అదే గుట్టపై ఉంటే ఫస్ట్ అటాక్‌లోనే చనిపోవాలి. అలా చనిపోలేదంటే మీడియాకు ఇచ్చే లీకులు, వార్తలు అవాస్తవమే. మావోయిస్టులను ఒకేసారి అందరినీ చంపడం సాధ్యం కాదు. కగార్ ఆపరేషన్‌పై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతోంది. కాల్పుల విరమణకు సిద్ధమని చెప్పినప్పటికీ ఇలా భద్రతా బలగాలతో కాల్పులకు తెగపడటం సరికాదు. 


ABP దేశం: కర్రెగుట్టల ఎందుకింత సంచలనంగా మారింది. కారణాలేంటి? సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మీ శాంతి కమిటీకి ఏం చెప్పారు?


జంపన్న: కర్రెగుట్టలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. మీడియాలో రకరకలాల కథనాలు వస్తున్నాయి. వెయ్యి మంది అక్కడలేరు. ఇటీవలవ జార్ఖంఢ్‌ సిసి మెంబర్ చనిపోయాడు. చలపతితో సహా కొందరు చనిపోయారు. ఇలా జార్ఖంఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో ఇలా అనేక చోట్ల విస్తరించి ఉన్నారు. ఆపరేషన్ కగార్ కేంద్రం మాత్రమే ఆపగలదు. కానీ బూటకపు ఎన్‌కౌంటర్లు చేయొద్దని మాత్రమే సిఎం రేవంత్ రెడ్డిని కోరాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు విజ్ఞప్తి చేయాలని తెలిపాం. సిఏం స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టుల సమస్య పరిష్కారం కాదు. ఇది సామాజిక,ఆర్థిక, రాజకీయ సమస్య అని తెలిపారు.


కర్రెగుట్టలు ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్ మధ్య 70 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీట్ల వెడల్పుతో ఉంటాయి.  కర్రెగుట్టలు ఎక్కాలంటే గంటకుపైగా సమయం పడుతుంది. కొన్ని వైపుల నుంచి గంటన్నరకుపైగా సమయం పడుతుంది. మరికొన్ని చోట్ల కనీసం ఎక్కడానికి కొత్తవారికి సాధ్యం కాదు. ఓవైపు నిచ్చెనలాపైకి ఎక్కే మార్గం 100 ఏళ్లపైగా ఉంది. కర్రెగుట్టలు అంత సులువుగా ఎక్కడం సాధ్యం కాదు. అందుకే ఇక్కడ మావోయిస్టులు అవసరాన్ని బట్టి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. 2001 తరువాత నేను కేంద్రకమిటీ సభ్యుడుగా కర్రెగుట్టలలో ఉన్నాను. అక్కడి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు దాడులు చేయడం ఈరోజు కొత్తకాదు. గతంలో అనేకసార్లు కర్రెగుట్టలను చేరుకున్నాయి. ఇప్పడు కావాలనే అటు మావోయిస్టులను, ఇటు భయట జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటూ కాల్పుల విరమణ పాటిస్తుంటే, కేంద్రం ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదు. 


ABP దేశం: మీరు చర్చలు అంటున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఇదే ఆఖరి పోరాటం అంటూ దూసుకుపోతున్నారు. శాంతి కమిటీగా మీరు ఏం చేయబోతున్నారు.?
జంపన్న: మావోయిస్టులను హతమార్చడంపై కేంద్రం ఇప్పటికైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి కమిటీగా శాంతిని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ముందుకెళ్తే ప్రభుత్వానికే నష్టం. ప్రజలే ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అణచివేతతో సమస్యకు పరిష్కారం కాదు. చర్చలతోనే అది సాధ్యం. పోలీసులు కొన్ని మార్గాల ద్వారా వస్తారు. కానీ గెరిల్లాలు ఊహించని విధంగా వెళ్లిపోతారు.


కర్రెగుట్టలలో ఆపరేషన్ పూర్తి చేసినా మావోయిస్టుల అంతం జరగదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వీలు కాకపోతే మరో ప్రాంతానికి వెళ్తారు. వివిధ రాష్ట్రాల్లో దట్టమైన అడవీప్రాంతాలు అనేకం ఉన్నాయి. కొంతమంది కావాలనే మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లడుతున్నారు. వాళ్లంతా కేంద్రానికి మద్దతు తెలిపేవారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణ, చర్చలు ఒక్కటే మార్గం. కేంద్రం రాజ్యాంగన్ని అనుసరించి, శాంతికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం.