sun-stroke in Telangana | హైద‌రాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఎండ‌లు, వ‌డ‌గాలులు అధికంగా  వీచే అవ‌కాశం ఉంద‌ని, జూన్  వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని , 12  సంబంధిత శాఖ‌ల‌తో  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  శుక్ర‌వారం స‌చివాల‌యంలో స‌మీక్షాస‌మావేశం నిర్వ‌హించారు.    

తెలంగాణ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌, ఇండియ‌న్ మెట్రాలాజిక‌ల్ శాఖ క‌లిసి స‌మ‌గ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్ష‌న్ ప్లాన్ HAP-2025 ను రూపొందించాయి. ఇందులో భాగంగా ప్ర‌తి జిల్లాకు ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించార‌ని తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సంద‌ర్బంగా  హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను విడుదల చేశారు.

  మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వ‌డ‌గాల్పుల దృష్ట్యా  చ‌లివేంద్రాల‌లో త్రాగునీరుతోపాటు ఓఆర్ఎస్, మ‌జ్జిగ  ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణయించాం. సి ఎస్ ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని స‌ర‌ఫ‌రా చేసేలా  అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ముఖ్యంగా రాజధాని హైద‌రాబాద్‌తో పాటు వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం,మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, కొత్త‌గూడెం, మెద‌క్‌, కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఫోకస్ చేయాలని ఆయన సూచించారు.

588 మండ‌లాలు వడగాల్పుల ప్రభావిత ప్రాంతాలు

తెలంగాణలో 612 మండ‌లాల్లో 588 మండ‌లాల‌ను వ‌డ‌గాలుల ప్ర‌భావిత ప్రాంతాలుగా  వ‌ర్గీక‌రించారు. తెలంగాణ రాష్ట్రం గ‌త‌నెల 15న హీట్‌వేవ్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్ట‌ర్‌గా నోటిఫై చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎవరైనా వడదెబ్బ, ఎండల కారణంగా చనిపోతే.. మృతుల కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియోను రూ. 50 వేల నుంచి రూ.4 ల‌క్ష‌ల‌కు  పెంచిన‌ట్లు తెలిపారు. ప్రజలపై వడ‌గాలుల ప్ర‌భావం ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అనుకోని ప‌రిస్ధితుల‌లో ఎవ‌రైనా చ‌నిపోతే ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ఫ‌ధంతో వ్య‌వ‌హ‌రించి త‌క్ష‌ణం ఎక్స్ గ్రేషియో అందించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. 

అధికారులకు సూచనలు, ప్రజలకు జాగ్రత్తలు..

అధిక ఉష్ణోగ్ర‌త‌ల వేళ ఎండ‌ల‌కు సంబంధించిన స‌మాచారం, ప్ర‌జ‌లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుప‌త్రుల‌లో ఫైర్ సేఫ్టీ నిర్వ‌హ‌ణ అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని సూచంచారు. ప్ర‌జా ఆరోగ్య కేంద్రాలు, ఆస్ప‌త్రుల‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. వేడి ప్ర‌దేశాల‌లో ప‌నిచేసే కార్మికుల‌ను రెండు బృందాలుగా విభ‌జించి క‌నీసం గంట లేదా 2 గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేష‌న్ ప‌ద్ద‌తి పాటించాలని ప‌రిశ్ర‌మ‌ల‌కు సూచించారు. ఘ‌న వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణా కార్మికులకు అవ‌స‌ర‌మైన విశ్రాంతి, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ కోసం షెల్టర్ సౌక‌ర్యాల విష‌యాల‌లో దృష్టిసారించాల‌ని కార్మిక సంక్షేమ శాఖ‌కు మంత్రి పొంగులేటి సూచించారు.

   బ‌స్టాండ్లు, పర్యాట‌క కేంద్రాలు, మార్కెట్లు, ప్రార్ధ‌నా స్ధ‌లాల వంటి పబ్లిక్ ప్రాంతాల‌లో షెల్ట‌ర్లు, త్రాగునీరు ఏర్పాటు చేయాలి. వేస‌విలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్‌,ఎల్ ఇ డి స్క్రీన్ల ద్వారా ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు. ముఖ్యంగా పార్కుల వ‌ద్ద ప‌క్షులు, వీధి జంతువుల కోసం నీటి స‌ర‌ఫ‌రాను స‌మ‌కూర్చాల‌ని చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది. పంచాయతీరాజ్ శాఖల త‌ర‌పున ప్ర‌జ‌ల‌కు క్లోరినేట్ చేసిన త్రాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని, ట్యాంక‌ర్ల ద్వారా నీటిని  స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. స‌మాచార శాఖ‌, మ‌త్య్స‌, ప‌శుసంవ‌ర్ద‌క శాఖ‌, ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా, అట‌వీ, విద్యుత్ శాఖ‌ల అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాని సూచించారు.