కృష్ణా నదీజలాల్లో  తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాడాలని, సమీక్ష కాదు .. సాగదీత కోసమే పాలమూరులో నీటిపారుదల శాఖా మంత్రి పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలని మేం 90 శాతం పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తట్టెటు మన్ను కూడా ఎత్తలేదన్నారు. క్రిష్ణా నదిలో తెలంగాణ నదీజలాలకు సంబంధించి న్యాయమైన వాటాకు పట్టుబట్టాలని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

 సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి 90 శాతం పైగా పనులు పూర్తయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకుని .. వీలైనంత తొందరగా పనులు  పూర్తి చేయాలి. కానీ రెండేండ్ల గడువు పెట్టడం అభ్యంతరకరం. ఏడాదిన్నరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మన్ను ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దేనికి నిదర్శనం. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి పనులను చేపట్టకపోవడం మాతృద్రోహం కాదా ? ఉద్దండపూర్ లో కొద్దిగా మినహా మిగిలిన నాలుగు పంప్ హౌస్ లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్ లు , టన్నెళ్లు, సర్జ్ పూల్స్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం.

నార్లాపూర్ లో వెట్ రన్ పూర్తి చేశాం .. మిగిలినవి డ్రై రన్ కూడా పూర్తి చేశాం. ప్యాకేజీ 3 లో 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలిపోయింది .. దాని కాంట్రాక్టు ఆన్ లైన్ లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రముఖ నాయకుడు ఉన్నాడు .. ఆయన కుమారుడు అక్కడ ఎమ్మెల్యే. దానిని చేయకపోవడానికి అక్కడి ప్రముఖుల ఒత్తిడి ఏమైనా ఉందేమో మాకు తెలియదు. ప్రాజెక్టు కోసం 27 వేల ఎకరాలకు గాను 100 ఎకరాలు మినహా మిగిలిన భూసేకరణ చేశాం. కేవలం పాలమూరు ఫలితాలు త్వరగా అందకూడదనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీద సమగ్ర సమీక్ష చేయకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. 

Continues below advertisement

12.30 లక్షల ఎకరాలకు ఈ పథకం కింద సాగునీరు నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అందుతుంది. నల్లగొండకు డిండి లిఫ్ట్ ద్వారా దీని నుండి సాగునీరు అందుతుంది. ఏదుల నుండి నీళ్లివ్వడం ఖర్చుతో కూడుకున్నది అని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాం .. దానికి బదులు తక్కువ ఖర్చుతో వట్టెం రిజర్వాయర్ నుండి అఫ్ టెక్ ద్వారా గ్రావిటీ కింద నీళ్లు తీసుకెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచించాం. దీనికి రూ.80 నుండి రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదుల నుండే నీళ్లు తీసుకెళ్లాలని రూ.1800 కోట్ల ఖర్చుకు సిద్దం అవుతుంది. దీనిలో రూ.1300 కోట్లు టెండర్లు కూడా పూర్తి చేశారు. రూ.80 కోట్లతో అయ్యే పనులను రూ.1800 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. నిపుణుల కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

పాలమూరు పనులు పక్కన పెట్టి డిండి పనులను ఎందుకు హడావిడిగా చేపడుతున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే దానిని నీటి పారుదల శాఖా మంత్రి ఎందుకు సమీక్షించడం లేదు ? పాలమూరు రంగారెడ్డిలో నారాయణ పేట, కొడంగల్ కు గ్రావిటీతో సాగునీళ్లు ఇచ్చే టెండర్లు రద్దు చేసి కొడంగల్ ఎత్తిపోతల ఎందుకు చేపట్టారు. నదీజలాల పునంపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 7న ఫైనల్ చేసేందుకు కేంద్రం రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులపై మేము అభ్యంతరం తెలిపాం .. ఈ నీటి వాటాలో తెలంగాణ వాటాను యధాతథంగా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే తెలంగాణకు గొడ్డలి పెట్టు. దీనిమూలంగా ఆల్మట్టి ఎత్తు పెంచి 160 టీఎంసీలు నిలుపుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో తెలంగాణకు నీళ్లు రావడం గగనంగా మారుతుంది 

ఆల్మట్టిలో 10 టీఎంసీల నీళ్లు వదులు కోవడానికి కింది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది .. అయితే ఆల్మట్టిలో అలా పెట్టుకోవడానికి ప్రాజెక్టు డిజైన్ సరిపోదు. అప్పుడు జూరాల వట్టిపోవడం ఖాయం. ఈ నెల 7న జరిగే సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టాలి. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో అట్టడుగు  నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పక్కన పెట్టి జూరాల నుండి కొడంగల్ ఎత్తిపోతల చేపట్టారు. కక్ష కట్టి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేసి అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు మీద రూ.32 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది 

పాలమూరు రంగారెడ్డిలో 90 శాతం పనులు పూర్తయ్యాయి అని ఒప్పుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ఫూర్తికి ధన్యవాదాలు. మరి మిగిలిన పనులను వెంటనే పూర్తిచేసి ప్రజలకు ఫలితాలు అందించాలని డిమాండ్జ నార్లపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లలో నీళ్లు నింపేందుకు అణువుగా పనులు చేపట్టాలి. సాగునీళ్లు ఇవ్వక, పండిన పంటలు కొనక రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. రైతుభరోసా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారు. రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నే చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బోనస్ ఎంత ? కొన్న ధాన్యం ఎంత ? ఏమీ ఇవ్వకుండానే రూ.లక్ష 70 వేల కోట్ల అప్పులు చేశారు .. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. మూసీ, హైడ్రాతో రాబడుల్ని ధ్వంసం చేశారు .. కాంగ్రెస్ వైఫల్యాలకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారంటూ’ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.