World Drug Day: ఒకసారి మత్తుకు అలవాటు పడితే అది మరణంతో సమానం అని హీరో నిఖిల్ సిద్దార్థ తెలిపారు. విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని.. దాన్ని ఆస్వాదించేందుకు తప్పటడుగు వేయొద్దని సూచించారు. ఈనెల 26వ తేదీన మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ భవనంలో మూడ్రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న  కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే పరివర్తన లోగోను ఆవిష్కరించారు. నగరం నలువైపుల నుంచి హాజరైన విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడడంతో తలెత్తే ఇబ్బుందులపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నిఖిల్ సిద్దార్థ మాట్లాడుతూ.. తనకు కూడా చాలా సార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తెలుగు సినీ రంగంలో బయటపడిన డ్రగ్స్ కేసుపై స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో ఎవరో చేసిన తప్పిదానికి అందరినీ నిందిచడం సరికాదని అన్నారు.


సినీ నటుడు ప్రియదర్శి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం 21 ఏళ్ల వయసులో తాను సిగరెట్ కు అలవాటు అయినట్లు చెప్పారు. మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా దాని వల్ల తలెత్తే సమస్యను గుర్తించానని అన్నారు. తనలో వచ్చిన పరివర్తనతో మెల్లగా ఆ అలవాటు ఆ అలవాటు నుంచి బయటపడినట్లు వివరించారు. టీఎస్ న్యాబ్ డైరెక్టర్, నగర సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు అంతా సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని కోరారు.