IndiGo Airlines emergency landing in Vijayawada airport | విజయవాడ: ఈ మధ్య రైళ్లు, విమానాలకు బెదిరింపులు వస్తున్నాయి. దాంతో వరుసగా విమాన సర్వీసులు రద్దు కావడమో లేక ఆలస్యం కావడమో జరుగుతోంది. కొన్ని కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కావాల్సిన ఓ విమానం విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో ప్రయాణికులు కంగుతిన్నారు.
గోవా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అయింది. గోవా నుంచి వచ్చిన ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది కానీ ల్యాండింగ్ కు అనుమతి రాలేదు. గాల్లో కాసేపు చక్కర్లు కొట్టిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దాంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆపై ల్యాండింగ్ అనుమతి రావడంతో ఇండిగో విమానం గన్నవరం నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ల్యాండ్ అయింది. దీనిపై ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించారు. ల్యాండింగ్ కు అనుమతి రాని సందర్బంలో సమీపంలోని విమానాశ్రయాల్లో అత్యవసర ల్యాండింగ్ సాధారణ విషయమని పేర్కొన్నారు.
జైపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
183 మంది ప్రయాణికులతో ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి మంగళవారం సాయంత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో ఫ్లైట్ కోల్‌కతా నుంచి బయలుదేరిందని, అయితే విమానంలో బాంబు ఉందని పైలట్‌కు సమాచారం అందినట్లు ఓ అధికారి తెలిపారు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌తో మాట్లాడగా జైపూర్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి అనుమతి రావడంతో ల్యాండింగ్ చేశాడు. దాంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇలా బాంబు బెదిరింపులు వచ్చేవి. కానీ ఈ మధ్య ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోయాయి.