BRS MLA Talasani Srinivas Yadav Latest News| హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం (Muthyalamma Temple)లో త్వరలో అమ్మవారి నూతన విగ్రహం ప్రతిష్టించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో మంగళవారం నాడు సమావేశం అయ్యారు. అనంతరం కుమ్మరిగూడకు చెందిన పండితులతో కలిసి వెళ్లి బస్తీ వాసులతో ఎమ్మెల్యే తలసాని మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విగ్రహం ధ్వంసం బాధాకరం, ముమ్మాటికీ దుర్మార్గపు చర్య
తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఇది ముమ్మాటికీ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇందుకు కారుకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ఏరియాలో అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిన నాటి నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తలసాని విచారం వ్యక్తం చేశారు. తనకు ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పరిస్థితులకు ముగింపు పలకాలని, ప్రశాంత వాతావరణంలో ఇక్కడి ప్రజలు జీవించేలా చేయడం తమ ఉద్దేశమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అమ్మవారి విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేయడంతో కొన్ని రోజులుగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటున్నా.. తమకు మళ్లీ అమ్మవారు కావాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పండితుల సూచనలు, సలహాల మేరకు నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బస్తీవాసుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని విగ్రహ ప్రతిష్టతో పాటు కుంభాభిషేకం, 3 రోజుల పాటు శాంతి పూజలు, హోమాలను నిర్వహించనున్నారు.
Also Read: KTR On Konda Surekha : వ్యక్తిగత దాడులను సహించను - లక్ష్మణ రేఖ గీస్తా - మరోసారి కేటీఆర్ హెచ్చరిక
బోనాలు సమర్పించనున్న బస్తీ వాసులు
ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసానికి తెలిపారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు అవకాశం లేకుండా పూజా కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అమ్మవారి విగ్రహం ప్రతిష్ట, పూజల తేదీలను నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ సభ్యులు కిరణ్, కిషోర్, మహేష్, ఎల్లేష్, సాయి, మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, BRS పార్టీ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని, నాగులు, రాములు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్, బస్తీ వాసులు మురళి, రవి, సునీత, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి తదితరులు ఉన్నారు.
Also Read: Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత