Indian Railways Economy Meals: ఆహారం కోసం రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే బోర్డు తక్కువ ధరకే భోజనం, టిఫిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 4 స్టేషన్లలో తక్కువ ధర భోజనాలను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు ద.మ. రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నాలుగు స్టేషన్లలో రూ.20 కే అల్పాహారం, రూ.50 కే నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు సాధారణ కోచ్ లు ఆగే ప్లాట్‌ఫారమ్‌ లపై ఈ తక్కువ ధరకే అందించే భోజనం, అల్పాహారం కౌంటర్లు ఉంచనున్నట్లు వెల్లడించారు. 


రైల్వే ప్రయాణికులు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా.. స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ లపై ఎకానమీ మీల్స్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు వివిధ స్టేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఐఆర్సీటీసీకి చెందిన కిచెన్ యూనిట్లు, జనాహార్ కేంద్రాలు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రకాల భోజనాలు ఉంటాయి. టైప్ 1 లో 7 పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడితో అందిస్తారు. దీనికి రూ.20 ఉంటుంది. టైప్ 2 లో అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భతూరే, పావ్ భాజీ, మసాలా దోశల్లో దేనినైనా ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ.50 గా నిర్ణయించింది రైల్వే బోర్డు. అలాగే 200 మిల్లీ మీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కూడా అందిస్తారు. వీటిని మీల్ కౌంటర్లలో అందుబాటులో ఉంచుతారు. ఇందుకు సంబంధించి జూన్ 27వ తేదీన రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ కోచ్ ల దగ్గర ప్లాట్ ఫారమ్ లపై ఎకానమీ మీన్స్, స్నాక్స్ అందించాలని జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరుస్తున్నామని, జోనల్ రైల్వే ద్వారా లొకేషన్ నిర్ణయిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 


రైలులోని రెగ్యులర్ కోచ్ లలో ప్రయాణించే వ్యక్తులు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు చేసింది రైల్వే బోర్డు. స్టేషన్ ప్లాట్ ఫారమ్ లపై జనరల్ క్యారేజ్ ముందు ఎకానమీ మీల్స్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. సాధారణ కోచ్ లలో ప్రయాణించే వారు తిండి, పానీయాల కోసం స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అందుబాటు ధరల్లో లేకపోవడం కూడా చాలా మందికి ఇబ్బందిగా మారింది. ప్రైవేటు వ్యక్తులు అందించే భోజనాలను వారికి ఇష్టమొచ్చిన ధరల్లో అమ్ముతుంటారు. ఈ ధరలు ఎక్కువగా ఉండటం, నాణ్యత లేకపోవడం వల్ల ఆకలితోనే ప్రయాణించాల్సిన దుస్థితి. ఈ సమస్యను గుర్తించిన రైల్వే శాఖ ఎకానమీ మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.