MLC Kavitha: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు 24 గంటల సమయం ఇస్తున్నానని.. ఆలోపు తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని కవిత సవాల్ విసిరారు. నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అన్నీ సింహాలే ఉన్నాయని.. కానీ కొన్ని పార్టీల్లో మాత్రం గ్రామ సింహాలు ఉన్నాయని తెలిపారు. ఎంపీ అర్వింద్ బాల్కొండలో అతిగా, అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణలో సంపద సృష్టించడం అవినీతి రహిత పాలను అందిస్తున్నామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలనలో అవినీతి జరగలేదా అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసని చురకలంటించారు.


తాను ఎంపీగా ఉన్నప్పుడు రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చినట్లు తెలిపారు. అదే సమయంలోనే స్పైస్ బోర్డు తెచ్చినా.. తాను తెచ్చానని ఎంపీ అర్వింద్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు తన భర్తపై కూడా ఆరోపణలు చేస్తున్నారని.. ఆయన పేరు తీసుకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను, నాన్న రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరేమన్నా సహించామని తన భర్త పేరు వాడడం అస్సలే సరైన పద్ధతి కాదని అన్నారు. పేదల పక్షాన ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, పార్టీలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ, డీఎన్ఏబీఆర్స్ తో మ్యాచ్ కాదని అన్నారు. బంపర్ మెజార్టీతో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.