Telangana Rains Latest News: తెలంగాణలో రాబోయే 5 రోజులకు సంబంధించి వాతావరణ వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. నేటి నుంచి వచ్చే 5 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు.
అంతేకాక, జూన్ 14వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల చొప్పున బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు.
ఇక ఈ వానాకాలం మొదలయ్యాక తెలంగాణ అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 135.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. తర్వాత నిజామాబాద్ లో 128.2 మి.మీ., జగిత్యాలలో 126.6 మి.మీ., పెద్దపల్లిలో 112.7 మి.మీ., కరీంనగర్‌లో 100.1 మి.మీ వర్షం కురిసినట్లుగా అధికారులు ప్రకటించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇలా..
భారత వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పరిసర ప్రాంతాల్లోని అనుబంధ ఉపరితల ఆవర్తనంతో పై వరకూ విస్తరించి ఉంది. ఇదిట్రోపోస్పిరిక్ స్థాయి ఎత్తుతో నైరుతి వైపు వంగి ఉంది.
ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ రికార్డు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు చరిత్రలోనే జూలై రెండో వారంలోనే గేట్లను ఎత్తివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరద నీరు రావడంతో... అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 70 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. అధికారులు 36 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 76 టీఎంసీలు, 1087.9 అడుగులకు చేరింది. బుధవారం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో , 4.57 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగింది.
గోదావరి నదిపై తెలంగాణలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసింది ఈ ఎస్సారెస్పీ ప్రాజెక్టే. అయితే దీన్ని 1963లో నిర్మించారు. 1983 తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నీటమట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు కాగా... నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు మొత్తం 42 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, వరద కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుంటుంది.