కిడ్నాప్, రేప్ కేసులో వనస్థలిపురం పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికి తీశారు. మాజీ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. దర్యాప్తులో నాగేశ్వరరావు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్, రేప్, హత్యాయత్నం, ఆయుధ నిరోధఖ చట్టం కింద నాగేశ్వరరావుపై పోలీసులు కేసులు పెట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. వెంట్రుకలు, దుప్పటి, గాజులను క్లూస్ టీం సేకరించింది. వివాహితపై అత్యాచారానికి తెగబడ్డ నాగేశ్వరరావును ఆమె భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు.


బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యాచారం చేసిన తర్వాత నాగేశ్వరర్వావు తన బట్టలు తానే ఉతుక్కుని, ఏమీ తెలియనట్టు మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి విధులు నిర్వర్తించాడని దర్యాప్తులో తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్ పల్లి ఠాణాలోనే రివాల్వర్ పెట్టేసి బెంగళూరుకు పరారైనట్లు వెల్లడైంది. 


కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలోని నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రేప్ సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్, లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనను హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించగా.. నాగేశ్వరరావును చర్లపల్లి జైలుకు పంపించారు. 


కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటి వద్ద ఉన్న ఓ దుకాణం నుండి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో సీసీ కెమెరాల్లో నాగేశ్వరరావు కారు గుర్తించారు. కారు వనస్థలిపురం నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు, ఆమె భర్తను బలవంతంగా తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం అయింది. ప్రమాదం జరగ్గానే... దంపతులిద్దరూ అక్కడి నుండి తప్పించుకున్నారు. తర్వాత వనస్థలిపురం పోలీసులకు తమపై జరిగిన దురాగతంపై ఫిర్యాదు చేశారు. మరో వైపు ప్రమాదం జరిగిన తర్వాత... ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు హోంగార్డుకు సమాచారం ఇచ్చాడు. అతను వచ్చి టోయింగ్ వాహనం సహాయంతో ప్రమాదానికి గురైన కారును చంపాపేట్ తరలించారు. నాగేశ్వరరావు ఫోన్ చేసిన హోంగార్డు ప్రవీణ్ స్టేట్ మెంట్ కూడా పోలీసులు రికార్డు చేశారు.


తనపై కేసు నమోదు అయిందని తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుండి బెంగళూరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు నాగేశ్వరరాపు ప్రయత్నాలు చేశాడు. కానీ అతని రాజీ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కేసును సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు.. నాగేశ్వరరావును పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారంగా నాగేశ్వరరావు ఆచూకీ కోసం గాలింపు సాగించారు. ఈ క్రమంలోనే ఎస్వోటీ పోలీసులు నాగేశ్వరరావును పట్టుకుని అరెస్టు చేశారు.