తెలంగాణలో వరదలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఎక్కడా అలసత్వం లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.
భారీ వానలు వరదల్లో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చేసేందుకు నిత్యం ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సీఎంవో తెలిపింది. ప్రగతి భవన్ వేదికగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం కేసిఆర్ పాల్గొంటున్నారని పేర్కొంది. సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలతో తక్షణమే అమలవుతున్నాయో లేదో నిరంతరం పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.
వరదలను ముందస్తుగా అంచనావేసి దార్శనికతతో నిర్ణయాలు సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని వెల్లడించింది. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనుల్లో నిమగ్నమైన ఉందని తెలిపింది. ప్రజాసంక్షేమం పట్ల బాధ్యత ఉన్న సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు.
ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలనే పట్టుదలతో యంత్రాంగమంతా పని చేస్తోందని పేర్కొంది సీఎంవో. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి సహా ఇరిగేషన్, రోడ్లు భవనాలు, విద్యుత్తు, వైద్యం, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో రాత్రి పగలు నిరంతర పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. వారితోపాటు సీఎం కేసిఆర్ కూడా జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు తెలిపింది.
ఊహించని రీతిలో తలెత్తిన భారీ వానలు వరదల కారణంగా ఇబ్బండి పడుతున్న ప్రజల్లో భరోసా నింపేందుకు యంత్రాంగమంతా కృతనిశ్చయంతో ఉన్నారని... సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పరిస్థితులు చక్కబెట్టేలా సీఎం ఆదేశాలిస్తున్నారని వెల్లడించింది. యంత్రాంగమంతా సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో స్వీయ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫలితంగానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని చాలా వరకు కట్టడి చేసినట్టు ప్రకటించింది.
నాలుగు రోజుల నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ ఆదేశాలు ఇస్తున్నారని... ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త తీసుకున్నట్టు సీఎంవో ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికార అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం అవసరమైన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీంలు, హెలికాప్టర్లు సిద్దం చేసినట్టు తెలిపింది.
సీఎం కేసిఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయని.. విద్యుత్తు, రోడ్లు, తాగునీరు వైద్యానికి నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది సీఎంవో. వానలు, వరదల కారణంగా ఎక్కడా అధిక ధరలకు వస్తువులు అమ్మకుండా వేరే సమస్యల్లేకుండా జాగ్రత్త పడినట్టు అధికారులను అప్రమత్తం చేసినట్టు ప్రకటించింది.