CM KCR Review: అనూహ్యంగా జులై రెండోవారంలోనే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు.. ఎగువ నుంచి దిగువకు ఉరకలెత్తిన గోదారమ్మ ఉద్ధృతికి వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సీఎం కార్యాలయమే వార్ రూంగా మారిపోయింది. అధికారులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఒక కంట్రోల్ రూంలా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వీయ పర్యవేక్షణలో 24 గంటలూ వరద నియంత్రణ చర్యలు, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు చేస్తున్నారు. వరద పరిస్థితులను ముందస్తుగానే అంచనా వేసి దార్శనికతతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకొంటున్నారు. గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షింస్తుండగా ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు ఆయన కార్యాలయం 24 గంటలు పని చేస్తోంది.
ప్రజా సంక్షేమం పట్ల ఆర్తి ఉన్న సీఎం కేసీఆర్.. గంట గంటకూ అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల పరిస్థితిపై సమాచారాన్ని తెప్పించుకొంటున్నారు. ఎప్పటికప్పుడే ఎలా స్పందించాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో మార్గ నిర్దేశం చేస్తున్నారు. జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సున్నితమైన, ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో రేయింబవళ్లు సీఎం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానికంగానే ఉంటూ తక్షణ సహాయ చర్యలను పర్యవేక్షించేలా అప్రమత్తం చేస్తున్నారు.
ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కడెం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్నది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి వసతితో పాటు భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు పూనుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. అలాగే విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు ఎప్పటికప్పుడూ చేపడుతూ... విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరదల వల్ల తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీకి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేశ్, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, విద్యుత్తు, రోడ్లు, భవనాలశాఖ, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.