EC Denied Permission To Telangana Cabinet Meeting: హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ వెంట ఉన్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయాయి. దాంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి  సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందన్నారు. అయితే రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే సుందిళ్ల, మేడిగడ్డ, అక్కడి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి అన్నారు.


నెల రోజుల్లో (జూన్‌లో) వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. 


కేబినెట్ భేటీ జరిగితే రైతులకు సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించాలనుకున్నారు. రాష్ట్ర పునర్విభజనకు పదేండ్లు పూర్తి కానున్న సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. 


సోమవారం లోపు కేబినెట్ భేటీకి ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. శనివారం కేబినేట్ భేటీ వాయిదా పడటంతో పలు కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని మంత్రులు తెలిపారు.