Telangana Politics: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట రామిరెడ్డిపై కేసు నమోదు చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024 కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి రాధాకిషన్ రావు మార్చ్ 9న ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐఏఎస్ వెంకట రామిరెడ్డికి రాధా కిషన్ రావు అత్యంత సన్నిహితుడని రఘునందన్ రావు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారని అన్నారు.


బీఆర్ఎస్‌కు పార్టీ ఫండ్
వెంకట రామిరెడ్డి, రాజ పుష్పా కన్స్‌స్ట్రక్షన్స్ యజమానులు నుంచి వసూలు చేసిన డబ్బులను ఎస్ఐ ద్వారా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్లు కిషన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు చెప్పిన ప్రకారమే తాను ఆ డబ్బును తరలించినట్లు ఎస్ఐ సాయి కిరణ్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని రఘునందన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు 9 మార్చి నాడు ఇచ్చిన వాంగ్మూలంలో వెంకట్ రాం రెడ్డి, రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ యజమానులు బీఆర్ఎస్‌కు ఫండ్స్ ఇస్తుందని వివరించినట్లు రఘునందన్ రావు ఫిర్యాదులో వెల్లడించారు. వెంకట రామి రెడ్డి, రాజ పుష్పా కన్స్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోవాలని, రాధా కిషన్ రావు, ఎస్ఐ సాయి కిరణ్ వాంగ్మూలం, స్టేట్మెంట్‌లను ఫిర్యాదుకు జత చేశారు.


ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట రామిరెడ్డిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంకట రామిరెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని? ఎవరు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలని కోరినట్లు చెప్పారు. వెంకట రామిరెడ్డి పొంగులేటి వియంకుడు అవడంతోనే అరెస్ట్ చెయ్యడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒకే కులం అవడంతో రేవంత్ రెడ్డి కాపాడుతున్నారా అంటూ నిలదీశారు. 
 
నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నా బయటే
గతంలో బీఆర్ఎస్ పాలనలోను వెంకట రామి రెడ్డి చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేసాడని రఘునందన రావు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ నాన్ బెయిలబుల్ కేసులలో తప్పించుకుని యధేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నాడని మండిపడ్డారు. తన జోలికి ఎవరు వెళ్లలేరనే ధీమాతో వెంకట రామిరెడ్డి ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని  విమర్శించారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంకట రామి రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, రాజ పుష్పా కన్స్‌స్ట్ర క్షన్స్ పెట్టుబడులు, ఇతర వ్యవహారాలపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


సీఈఓను కలిసిన రఘునందన్ రావు
మెదక్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఓటర్‌కు ఐదు వందల రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బూత్‌ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్‌లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారని అన్నారు. 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని విమర్శించారు. సిద్ధిపేట పోలీస్‌ కమిషనర్‌కు, మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. రూ.84 లక్షల డబ్బులను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి డిస్క్వాలిపై చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు.