Andhra Politics : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి లండన్ వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్ లోకేష్ ఉన్నారు. ఆయన సీఎం పర్యటనను అడ్డుకోవడానికి వచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని టీవీ చానళ్లలో ఆయన మాట్లాడి ఉండటంతో పోలీసుల తీరు వివాదాస్పదమయింది.
అనుమానాస్పదంగా తిరుగుతూండటంతో గన్నవరం ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని, అయితే అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అయితే లోకేష్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కిడ్నాప్ చేశారని, వేధించారని, చివరకు ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆయనను పోలీసులు వదిలి పెట్టారు.
అమెరికన్ సిటిజన్, అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని బెదిరించిన వైనం సోషల్ మీడియాలో సంచనలంగా మారింది. అసలు ప్రత్యేక విమానంలో వెళ్లే జగన్ ను ఆయన ఎలా అడ్డుకుంటారని.. ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో కావాలనే ఆయనను అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు వదిలి పెట్టడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయనను టీడీపీ నేతలు పరామర్శించారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ లోకేష్ గారిపై 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు దుర్మార్గమని దేవినేని ఉమ మండిపడ్డారు.
ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ ని గుర్తు పట్టిన వైసీపీ నాయకులు సీఎం సెక్యూరిటీకి సమాచారం అందించారని.. ఒక సీనియర్ డాక్టర్, అమెరికా సిటిజెన్ ను మ్యాన్ హ్యాండిల్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఏ రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో సీఎం సెక్యూరిటీ అధికారులు ఈ పనిచేశారో స్పష్టం చేయాలన్నారు. అమెరికన్ సిటిజన్ అయినా మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై సోషల్ మీడియాలో స్పందించినందుకే కక్ష కట్టారని.. ఆరోపించారు. తక్షణమే బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తాం. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడని హెచ్చరించారు.