TSCSB Saves Rs 60 Lakh Of Hyderabad Woman| హైదరాబాద్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ నేరాలు, లైంగిక వేధింపులు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ సైబర్ నేరగాడు ఆమెకు ఫోన్ చేసి రాత్రంతా వీడియో కాల్ మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడు చెప్పినట్లుగానే నిందితుడి బ్యాంకు ఖాతాకు ఏకంగా రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తరువాత తాను మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించిన సంబంధిత అధికారులు నిందితుడికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేపించారు. 


అసలేం జరిగిందంటే.. 
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నివసించే ఆర్కిటెక్ట్‌ అయిన మహిళకు మే 15వ తేదీ రాత్రి ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్నాను. మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కున్నారని ఆ మహిళను బెదిరించాడు. తనతో వీడియోకాల్ మాట్లాడాలని చెప్పగా ఆమె అలాగే చేసింది. భయాందోళనకు గురైన మహిళ స్కైప్‌లో వీడియోకాల్‌ లో నిందితుడితో మాట్లాడింది. తనను ఏ కేసుల్లో ఇరికించవద్దని, తనకు వేటితో సంబంధం లేదంటూ వేడుకుంది. ఇదే అదనుగా భావించిన సైబర్ కేటుగాడు తనకు నగదు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు.


వీడియో కాల్ కట్ చేస్తే ఏమైనా చేస్తాడేమోనని ఆందోళనకు గురైన మహిళా ఆర్కిటెక్ట్ నిందితుడితో రాత్రంతా మాట్లాడుతూనే ఉంది. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి తాను చెప్పిన బ్యాంకు ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పగా అతడు చెప్పినట్లే చేసింది. స్కైప్ వీడియో కాల్ ఆన్‌ చేసి ఉంచిన మహిళ బ్యాంకుకు వెళ్లి రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తారని బయపడి నిందితుడికి డబ్బులు పంపింది.


1930కి కాల్ చేసి మహిళ ఫిర్యాదు 
తరువాత తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది.  సీఎస్‌బీ (TSCSB) టీమ్ అప్రమత్తమై ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వివరాలను సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ లో ఎంటర్ చేశారు. నగదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకు సంబంధిత ప్రతినిధులను అలర్ట్ చేసి ఖాతాలను ఫ్రీజ్ చేపించారు. నిందితుడు నగదును మరో ఖాతాకు బదిలీ చేయకుండా, విత్ డ్రా చేసే అవకాశం లేకుండా చేశారు. అయితే రూ.60 లక్షలు క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే మహిళా ఆర్కిటెక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం, నిందితుడి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం గంటలోనే జరిగిపోవడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు. 


కేసుల్లో ఇరుక్కుంటావని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని ఎవరైనా ఫోన్ చేసి బెదిరించి.. డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. పోలీసులుగానీ, బ్యాంక్ అధికారులుగానీ ఏ వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయరని గుర్తించాలన్నారు. మీ భయమే నేరగాళ్లకు పెట్టుబడి అని, ధైర్యంగా వ్యవహరించి మీ నగదును కాపాడుకోవాలని, చిక్కుల్లో పడకూడదని సూచించారు.