Saudi Arabia's Swimwear Fashion Show: సౌదీ అరేబియా అంటే ఒకప్పుడు (Swimwear Fashion Show in Suadi) మనకున్న అభిప్రాయం వేరు. ఇప్పుడు ఆ దేశం కనిపిస్తున్న తీరు వేరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఎక్కడి లేని ఆంక్షలు విధించిన పాలకులు ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. మహిళలు శరీరాన్నంతా కప్పుకునేలా దుస్తులు ధరించాలని చాలా కచ్చితమైన నిబంధన పాటించిన సౌదీ ఇప్పుడు వాళ్ల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. అందాల పోటీలకూ సౌదీ యువతులు పోటీ పడుతున్నారంటే అక్కడ ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా స్విమ్‌సూట్‌ ఫ్యాషన్‌షో నిర్వహించింది.  అరబ్‌ వరల్డ్‌ని రిప్రజెంట్‌ చేసే స్విమ్‌సూట్స్‌ని ప్రత్యేకంగా తయారు చేయించి మరీ అక్కడ ఓ ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేశారు.


సౌదీ చరిత్రలోనే ఈ తరహా షో జరగడం ఇదే తొలిసారి. చాలా మంది మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గొనడాన్ని గౌరవంగా, ఓ హోదాగా భావించారు. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Global లో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్‌ని నిర్మించింది ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్‌ చేస్తోంది. 


ఎన్నో సంస్కరణలు..


ప్రిన్స్‌ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్‌ వచ్చిన తరవాత ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు. సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్‌లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్‌ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.


2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్‌ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు సల్మాన్. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి. ఆచారాల పేరుతో గిరి గీసుకున్న సౌదీ ఇప్పుడు పూర్తిగా ఆ హద్దులు చెరిపేస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. 


Also Read: Prajwal Revanna Case: ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు, దేవెగౌడ కీలక వ్యాఖ్యలు