Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. 


మార్నింగ్‌ 13 మందితో బ్రిజ్‌లాల్‌ మాట్లాడారు. టెలీకాన్ఫరెన్స్‌లో సమావేశమైన సిట్ సభ్యులు...రెండు రోజుల్లో చేపట్టాల్సిన దర్యాప్తు, పర్యటించాల్సిన ప్రాంతాలను గుర్తించారు. దర్యాప్తు ఏ అంశాలపై ఉండాలి... ఎవరెవర్ని విచారించాలి...ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంశాలు ఏంటనే దానిపై సమగ్ర అవగాహనకు వచ్చారు. అనంతరం బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. 


13 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్‌ పోలింగ్ అనంతరం హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటన కోసం టీమ్‌లుగా విడిపోయింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు నాలుగు ప్రాంతాల్లో జరిగాయి. అందుకే సిట్ బృదం కూడా నాలుగు టీమ్‌లుగా విడిపోయింది. ఒక్కో బృందం ఒక్కో ప్రాంతంలో పర్యటించి అక్కడ జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టానున్నారు. 
 
సిట్ సభ్యులు మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడ ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో తేలిన వివివరాలు తీసుకోనున్నారు. ఆ రోజు జరిగిందే మీడియా నుంచి వీడియో ఫుటేజ్ కూడా తీసుకోనున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ న విశ్లేషించనున్నారు. స్థానిక పోలీసులతో మాట్లాడి పోలింగ్‌కు ముందు రోజు నుంచి ఏం జరిగిందనే వివరాలు రాబట్టబోతున్నారు. పోలింగ్ స్టేషన్‌లలోజరిగిన గొడవలపై కూడా దృష్టి సారించారు. 


పోలింగ్ అనంతరం జరిగిన గొడవలపై ఏర్పాటైన సిట్‌ బృందంలోని సభ్యులుగా ఎవరెవరు ఉన్నారంటే... ఏసీబీ ఎస్పీ రమాదేవి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులతోపాటు వీ శ్రీనివాస్‌రావు, రవి మనోహర్‌ చారీ అనే మరో ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు. వీళ్లతోపాటు వెంకటరావు, రామకృష్ణ, భూషణం, ఎన్‌ ప్రభాకర్‌, శివప్రసాద్‌, జీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలను కూడా సిట్‌లో నియమించారు. 


ఈ 13 మంది కలిసి రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులను, ఇతర వర్గాలను విచారించి రెండ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. మరికొందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఈ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 


మరో వైపు పలు ఘటనల్లో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యం కనిపించడంతో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేశారు.  మరికొంత మందిని  బదిలీ చేశారు. పలువురు దిగువస్థాయి పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఇప్పటికే కౌంటింగ్ అనంతర హింస ఎక్కువగా ఉంటుందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద  ఎత్తున బలగాలను ఏపీకి తరలిస్తున్నారు.