Andhra Pradesh News:  రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో మీ ముందు ఏదైనా లారీ వెళితే.. ఒక్కసారిగా ఆ లారీ వెంట పెద్ద ఎత్తున దుమ్ము, దూళి చెలరేగుతుంటుంది. ఒక్కోసారి వాహనంలో నుంచి ఇసుక గాలికి ఎగిరి వాహనదారులు కళ్లల్లో పడుతుంది. ఇది అనేక సార్లు పెను ప్రమాదాలకు కారణమవుతోంది. సాధారణంగా ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీలపై తప్పనిసరిగా టార్పాలిన్‌ వేయాలి. కానీ, లారీ డ్రైవర్లు వీటిని ఎక్కడా అమలు చేయడం లేదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీలు వల్ల కలుగుతున్న వాయు, శబ్ధ కాలుష్య నివారణ, గ్రామస్తులకు కలుగుతున్న అసౌకర్య తొలగించేందుకు హైకోర్టుకు కీలక చర్యలు చేపట్టింది. విచారణలో కోర్టుకు సహాయకులుగా(అమికస్‌క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు నోర్మా అల్వారెస్‌, కేఎస్‌ మూర్తి చేసిన పలు సూచనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఇసుక రవాణా చేస్తున్న అన్ని ట్రక్కులపై టార్పాలిన్లు కప్పడం తప్పనిసరి చేసేలా రాష్ట్రంలో ప్రస్తుతం మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీసీకేసీ ప్రాజెక్ట్స్‌, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు గనులు, భూగర్భశాఖ అధికారులను ఆదేశించింది. 


తదుపరి విచారణ


టార్పాలిన్‌ కప్పకుండా రవాణా చేస్తే ఎంత జరిమానా విధించాలనే విషయంపై తదుపరి విచారణలో తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయమై సలహాలు ఇచ్చే అంశాన్ని ఏజీ, అమికస్‌ క్యూరీలకు హైకోర్టు విడిచిపెట్టింది. ట్రక్కులు ఏ సమయంలో తిరిగేందుకు అనుమతించాలనే దానిపైనా అమికస్‌ క్యూరీ, ఇసుక రవాణాలో భాగస్వాములైన వారితో సంప్రదించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. తదుపరి విచారణలో ఈ అంశాన్ని చర్చిస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 31కి హైకోర్టు వాయిదా వేసింది. 


విచారణ అందుకే


పల్నాడు జిల్లా అమరావతి మండలం వముత్తాయపాలెం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతోంది. నదికి అడ్డంగా ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుకను భారీ వాహనాలతో తరలిస్తున్నారని పేర్కొంటూ జీవీఎస్‌ఎస్‌ వరప్రసాద్‌, మరో ఐదుగురు 2023 ఏప్రిల్‌లో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతోపాటు మరికొన్నింటినీ కలిపి హైకోర్టు తాజాగా విచారిస్తోంది. గోవాలో ఇసుక అక్రమ రవాణా, శబ్ధ, వాయు కాలుష్య నిర్మూలనకు తీవ్రంగా కృషి చేసిన న్యాయవాది, పర్యావరణ వేత్త నోర్మా అల్వారెస్‌ను ధర్మాసనం అమికస్‌ క్యూరిగా నియమించింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి కూడా అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్నారు.