Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?
రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఛత్తీస్‌గడ్‌ నుంచి ద్రోణి విస్తరించి ఉంది. దీని కారణంగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. నాలుగు రోజుల పాటు వర్షాలు పడొచ్చిన వాతావరణ శాఖ తెలిపింది.


వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు: తూర్పుగోదావరి, పార్వతీపురం, పశ్చమగోదావరి, కోనసీమ, బాపట్ల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం, నంద్యాల కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. 


గురు శుక్రవారం కూడా బాపట్ల, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 131 సెంటీమిటర్ల నుంచి 43 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయింది. 


తిరుమలలో కుండపోత...
తిరుమలలో కుండపోత వాన వెంకటేశ్వర స్వామి భక్తులను ఇబ్బంది పెట్టింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిపోయిన భక్తులు ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఆవరించడంతో ఉపశమనం పొందారు. 






తెలంగాణలో వెదర్ చూస్తే... 
మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు ఆనుకొని ఉన్న సైక్లోనిక్ సర్క్యులేషన్, చత్తీస్‌గఢ్‌, తమిళాడు మధ్య ఉన్న మరో ఆవర్తనం కారణంగా తెలంగాణలో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 






ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన జిల్లాలు:- గద్వాల్ జిల్లా, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి






శుక్రవారం వర్షాలు కురిసిన ప్రాంతాలు:- నాగర్ కర్నూలు, జయశంకర్‌, సిద్దిపేట, ఆసిఫాబాద్‌, గద్వాల్, కరీంనగర్, భూపాలపల్లి, హనుమకొండలో జోరు వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.71 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 


రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు నమోదు అవ్వగా... కనిష్ట ఉష్ణగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీలు రిజిస్టర్ అయింది. ఇదే వాతావరణం మరో రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.