వరంగల్..


ఆపరేషన్ కగార్..


మావోయిస్టులను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అది కొనసాగుతుంది. మావోయిస్టుల అంతం లక్ష్యంగా కగార్ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. కగార్ అంటే తెలుగులో అంతం లేదా చివరి అనే అర్థం. 


ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో అడవి దద్దరిల్లుతోంది. ఐదు నెలల నుండి వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. ప్రతి ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పైచేయి సాధిస్తున్నారని చెప్పవచ్చు.
అయితే వరుస ఎన్ కౌంటర్ లకు అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహానికి ఎండాకాలం కలిసి వస్తుంది. పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా ఎండాకాలం ప్రారంభంలోనే ఛత్తీస్ గఢ్ అభయారణ్యాన్ని క్యాంపులతో చుట్టుముట్టారు. ఎండాకాలం ఆకురాలే కాలం కావడంతో పాటు మావోయిస్టులు నీటి కోసం నీటి వనరుల వద్దకు రావడం సహజం. ఇదే పోలీస్ బలగాలకు కలిసి వస్తుంది. అంతే కాకుండా అడవి పూర్తిగా ఎండిపోవడంతో పోలీసులు డ్రోన్లు, శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించుకొని మావోయిస్టులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో పోలీసుల వ్యూహం ముందు మావోయిస్టులు నేలరాలక తప్పడం లేదు. 


ఐదు నెలలుగా ఆపరేషన్ కగార్  
ఛత్తీస్‌గఢ్ తో పాటు మహారాష్ట్ర లోని తెలంగాణ సరిహద్దుల్లో పోలీస్ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల ఏరివేతకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఐదు నెలల్లో దాదాపు 27 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో 107 మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు పార్టీ చెబుతోంది. 27 ఎన్ కౌంటర్లలో 18 ఎన్ కౌంటర్ లు బూటకపు ఎన్ కౌంటర్లని ఛత్తీస్ గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ఫ్ పేరిట లేఖ విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్లలో 45 మంది అమాయకులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట అడవుల్లో మారణహోమం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో ప్రస్తావించారు.


చరిత్రలో తొలిసారి భారీ నష్టం
మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు. దేశంలో మావోయిస్టు లను అణచి వేయడానికి అనేక ఆపరేషన్లు కొనసాగాయని ఇంత పెద్ద ఎత్తున పార్టీకి నష్టం జరగలేదని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న ఆపరేషన్ లో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. పోలీస్ బలగాలు టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు ఎండాకాలం కలిసి వచ్చే అవకాశం ఉండడంతో పక్కా ప్రణాళికతో పోలీసులు మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నారని మాజీలు చెప్పారు. పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా ముందే దండకారణ్యాన్ని ముందే చుట్టు ముట్టడం, మావోయిస్టులు పోలీస్ ల వ్యూహాన్ని పసిగట్టలేక పోవడంతో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండాకాలం కావడంతో పాటు దండకారణ్యం వదిలి ఇతర రాష్ట్రాల సేఫ్ జోన్ లోకి వెళ్ళలేని పరిస్థితి. దీంతో దండకారణ్యంలోనే తలదాచుకోవాలి. పోలీస్ బలగాలు అణువణువు జల్లెడ పడుతుండడంతో మావోయిస్టులు తారస పడగానే ఒకరిపై ఒకరు ఫైరింగ్ చేసుకోవడం ఇందులో పోలీస్ బలగాలు చేతిలో ప్రాణాలు వదులుతున్నారు. 


కార్పొరేట్ శక్తుల కోసం ఆపరేషన్స్...


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అడవులను, అడవుల్లోని వనరులను కట్టబెట్టడం కోసం ఇలాంటి ఆపరేషన్స్ కొనసాగుతాయని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు అభిప్రాయపడ్డారు. దేశంలో బిజెపికి ప్రధాన రాజకీయ శత్రువు మావోయిస్టు పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుకూల శక్తుల భావజాలం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను అణిచివేయడం కోసం ఇలాంటి ఆపరేషన్స్ కొనసాగిస్తాయని లంక పాపిరెడ్డి చెప్పారు. అడవులను, అడవుల్లో ఉన్న విలువైన సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే తిప్పికొట్టింది మావోయిస్టు పార్టీ కాబట్టి అనేక పేర్లతో ఆపరేషన్స్ కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ దాడులను ఎదుర్కోవడానికి వ్యూహం మార్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.


ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలి.. 
మావోయిస్టులకు బిజెపి, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం విరోధులుగా ఉన్నాయి. దాంతో దేశంలో వస్తున్న అనేక మార్పుల్లో భాగంగా ప్రజల్లో ఆదరణ ఉన్న మావోయిస్టు పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పాపిరెడ్డి అన్నారు. పార్టీ కి సంబంధించిన నాయకులను ఎన్నికల బరిలో నిలపాలని ఆయన అభిప్రాయపడ్డారు.