Tamil Nadu Crime News : తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కుర్తాళం జలపాతం సహా పలు జలపాతాలు కళకళలాడుతున్నాయి. జలపాతాలు వద్ద పారుతున్న నీటిని చూసేందుకు, ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు రెండు రోజులు నుంచి వస్తున్నారు. కుర్తాళం జలపాతంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఇతర ఐదు జలపాతాలు, పాత కుర్తాలం జలపాతంలోకి భారీగా నీరు చేరింది. భారీగా చేరిన నీరు కిందకు ప్రవహిస్తున్న అందమైన తీరును ఆస్వాదించేందుకు సందర్శకులు వస్తున్నారు.


గడిచిన మూడు, నాలుగు రోజులు మాదిరిగానే శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు కుర్తాళం జలపాతం వద్దకు వచ్చి స్నానాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే, మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ విషయం తెలియక చాలా మంది కుర్తాళం జలపాతం వద్ద స్నానాలు చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో కుర్తాళం జలపాతం ఉప్పొంగింది. వరదలను తలపించేలా జలపాతం నుంచి భారీ ఎత్తున నీరు కిందకు పారింది. పెరిగిన నీటి ప్రవాహాన్ని చూసిన అక్కడున్న ఎంతో మంది జలపాతంలో స్నానాలను చేస్తున్న వారిని హెచ్చరించారు. దీంతో చాలా మంది బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు.


జలపాతంలో పెరిగిన నీటి ప్రవాహం గురించి, కింది నుంచి చెబుతున్న హెచ్చరికలు తెలియక ఒక యువకుడు జలపాతంలోకి చేరిన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అత్యంత వేగంగా ప్రవహిస్తున్న ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్న తిరునల్వేలికి చెందిన 17 ఏళ్ల అశ్విన్‌ యువకుడు జలపాతంలో కొట్టుకుపోయారు. ఈ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు విపత్తు నిర్వహణ సంస్థ, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. రెస్క్యూను కొనసాగిస్తున్నారు. జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు పాళయంకొట్టైజలోని ఎన్జీవో కాలనీలో 11వ తరగతి చదువుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.






కలెక్టర్‌ ఏకే కమల్‌ కిషోర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ టీపీ సురేష్‌ కుమార్‌, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని గాలింపు చర్యలను చేపట్టారు. జలపాతానికి 500 మీటర్లు దూరంలో రాళ్ల మధ్య చిక్కుకున్న అశ్విన్‌ మృతదేహాన్ని సాయంత్రం 5.10 గంటలకు రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.