Bala Latha Vs Smita Sabharwal: ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా అవసరమా అంటూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై రేగిన దుమారం ఇంకా చల్లారలేదు. వికలాంగుల శక్తి, సామర్థ్యాలను తక్కువ చేసేలా, వారిని అవమానించేలా స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమెపై హక్కుల కార్యకర్తలు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు, రాజకీయ రంగంలోని ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తన వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ఆమె సమర్థించుకుంటున్నారు. పాలనకు సంబంధించిన సమస్యలపై బ్యూరోక్రాట్లు స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తారంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసులో ఉన్న ఉద్యోగినిగా 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో తన ఆలోచనలను, ఆందోళనలను వెల్లడిస్తున్నానని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ధైర్యంగా ఆమె ప్రశ్నిస్తున్న తీరుపై కొందరు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
IAS, IPS లలో వికలాంగుల కోటా ఎందుకుండాలి?
అత్యున్నత సర్వీసుల్లో వికలాంగుల కోటా ఎందుకుండాలి? జస్ట్ ఆస్కింగ్ ’’ అంటూ ఆమె ట్వీట్ చేయడంతో నెటిజన్లు స్పందించడం మొదలుపెట్టారు. వికలాంగులను విమానయాన సంస్థ పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం ఉన్నసర్జన్‌పై మీరు భరోసా ఉంచుతారా..? అంటూ ఆమె తన అభిప్రాయాలను మరింత సమర్థించకుంటోంది. IAS/IFS ఉద్యోగాలతో పాటు రక్షణ రంగాల్లో వికలాంగుల కోటాను ఎందుకు అమలు చేయట్లేదో హక్కుల కార్యకర్తలు ఒకసారి పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. IAS లు కూడా వీటికి అతీతం కాదనేదే తన ఉద్దేశ్యమని చెప్పారు. ప్రజల సమస్యల్ని ఓపికగా వినాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. సుదీర్ఘ గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ చేయాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.
అసలీ దుమారానికి కారణం ఏమిటంటే...,
మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి 2022లో మల్టీ డిజబిలిటీ కేటగిరీలో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆమె వైకల్య ధ్రువీకరణ పత్రంపై అనేక అనుమనాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో పూజ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని జులై 19న యూపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. యూపీఎస్సీకి ఎంపిక కాకమునుపు పూజ డాక్టర్‌గా పనిచేశారు. సరిగ్గా పరిశీలించకుండానే ఆమెను ఎందుకు ఎంపిక చేశారంటూ తన అభిప్రాయం పంచుకున్న స్మితా సబర్వాల్ అసలు వికలాంగులకు యూపీఎస్సీ వంటి సర్వీసుల్లో స్థానం ఉండకూడదని చెప్పారు. అంతటితో ఆగపకుండా పూజా ఖేద్కర్ విషయంలో యూపీఎస్సీ చాలా వేగంగా స్పందించి సరైన చర్యలు తీసుకుందని అభినందించారు. ఈ పనివల్ల యూపీఎస్సీపై లక్షలాది మంది విద్యార్థుల నమ్మకం నిలబడుతుందని చెబుతూనే ఇప్పటికే సేవలందిస్తున్న అధికారుల (సర్వింగ్ ఆఫీసర్స్) ధ్రువపత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కోరారు.
పూజ ఇష్యూతో శనివారం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ మరో అయిదేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా చేయడంపైనా ఆమె స్పందించారు. రాజీనామా చేయడం బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అవుతుందని, పొరపాటున జరిగిందా లేదా ఎవరి పాత్రయినా ఉందా తేలాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాను స్మితా నిలదీయడంపై జీతూ సాల్వి అనే యూజర్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ధైర్యం కావాలని ప్రశంసించారు.
స్మితా సబర్వాల్ పై విమర్శలు..
ఒక ఐఏఎస్ అధికారికి వికలాంగుల పట్ల అవగాహన లేకపోవడం చిత్రంగా ఉందని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్. కరుణ ట్వీట్ చేశారు. ‘‘చాలా వైకల్యాలు ఒక వ్యక్తి తెలివి తేటలు, శక్తి మీద ప్రభావం చూపవు. జ్ఞానోదయం చాలా అవసరమని మీ ట్వీట్ ద్వారా అర్థం అవుతోంది.’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం వికలాంగుల విషయంలో స్మితా అభిప్రాయం సరైంది కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్మిత ట్వీట్ దివ్యాంగులను అవమానించేలా, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం దివ్యాంగులుగా మార్చినట్టు లక్ష్మన్ గుర్తు చేశారు.
స్మితా వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదుటివారి వైఖల్యాన్ని చూసి నిందించకూడదని హితవు పలికారు. ఆమె వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.
IAS కొట్టాలంటే అందగత్తె కానవసరం లేదు: బాల లత
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ CSB ఐఏఎస్ అకాడమీ నిర్వహకురాలు బాల లత ఘాటుగా స్పందించారు. ఐఏఎస్ కొట్టడానికి అందగత్తెలు కావాల్సిన అవసరంలేదని వక్తిగతంగా ఆమెపై దాడి చేశారు. స్వయంగా తాను కూడా దివ్యాంగురాలు కావడం చేత ఆమె స్పందించి ఉండొచ్చు. స్మితా సబర్వాల్ 24 గంటల్లోపు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాను ఇప్పటికీ సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావా? అంటూ స్మిత సబర్వాల్‌కు సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపైనా స్మితా సబర్వాల్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆమె ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, యూపీఎస్సీ నా వయసు కారణంగా ఇప్పుడు అనుతిస్తుందా అన్నారు. దివ్యాంగ కోటాను బాలలత ఎందుకు ఉపయోగిస్తున్నారు? కోచింగ్ ఇనిస్టిట్యూట్ నడిపేందుకా? ప్రజల కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకా అని ఆమెను ప్రశ్నించారు.
Also Read: ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి - వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్
Also Read: దివ్యాంగులు ఐఏఎస్‌లుగా ఉండకూడదా ? స్మతా సబర్వాల్‌పై విమర్శలే కాదు సమర్థింపులు కూడా !