దేశం కాని దేశంలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి ఆపసోపాలు పడుతోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆ అమ్మాయి ఎయిర్ పోర్టులోనే రాత్రంతా ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాగైనా సరే తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.  


రాత్రంతా ఎయిర్ పోర్టులోనే కష్టాలు..


ఫిలిప్పీన్స్‌లోని మనిలా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్ పోర్టు బ్లాక్ అయ్యిందని తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని నవ్యకు సూచించారు.  ఆ మాటకు నవ్య షాక్ అయ్యారు. మనిలా ఎయిర్ పోర్టులోనే నవ్య రాత్రంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయితే తన పాస్ పోర్ట్ కావాలనే బ్లాక్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు.  


అడిగినన్ని డబ్బులు ఇవ్వనందుకే అలా చేసుంటాడు..


ఫిలిప్పీన్స్‌లోని మనిలా ప్రాంతంలోని ఓ ఇంట్లో నవ్య రెండేళ్లుగా నివాసం ఉండేవారు. కరోనా సమయంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతున్నారు. ఇవ్వకపోతే పాస్ పోర్ట్ బ్లాక్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగారని.. డబ్బులు కట్టక పోవడం వల్లే పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్ పని చేస్తున్నట్లు నవ్య తెలిపారు. ఒకసారి తన ఇంటి యజమాని ఇంటికి వెళ్లి విచారించాలని కోరారు. పాస్ పోర్ట్ బ్లాక్ అయిందని ఇంటికి పంపిస్తే తన చదువు మధ్యలో ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తన భవిష్యత్తు గురించి ఆలోచించైనా తన పాస్ పోర్ట్  ఎలా, ఎందుకు బ్లాక్ అయిందో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.   


ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ అధికారల కస్టడీలో నవ్య..


హైదరాబాద్‌కు చెందిన నవ్య మూడేళ్లుగా ఫిలిప్పీన్స్‌లోనే ఉంటున్నారు. కొవిడ్ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాక తరిగి ఫిలిప్పీన్స్‌ వెళ్లారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లారు. పాస్‌పోర్ట్ బ్లాక్ అయినందున ఇండియాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే అంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అయితే మొన్నటి నుంచి ఎయిర్ పోర్టులోనే ఉన్న తనకు కనీసం లగేజ్ కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు నవ్య. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు వివరించగా ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్న ఆమెకు.. తిరిగి ఇండియా వెళ్లే వరకు లగేజ్ ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. అధికారులు స్పందించి తనకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నవ్య.