గృహ హింసను ఎదుర్కొంటున్న ఓ మహిళ ఆ బాధలు తాళలేక ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు రాసిన సూసైడ్ నోట్‌లో అసలు తన శవాన్ని భర్త తాకవద్దని రాసుకొచ్చింది. భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేకపోతున్నానని, అందుకే తాను ఈ లోకాన్ని విడిచి పోతున్నట్లుగా ఆమె ఆత్మహత్యకు ముందు రాసుకున్న సూసైడ్ నోట్ లో రాసింది. తన భర్త మానసిక వ్యాధిగ్రస్తుడని, భార్యను ఎలా చూసుకోవాలో కూడా అతనికి తెలీదని వాపోయింది. చనిపోయే సమయంలో బాధితురాలు మూడు నెలల గర్భవతి కూడా. హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది.


బాధితురాలు తన డైరీలో కూడా తన బాధనంతా వివరించింది. బాలాపూర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాహిన్‌ నగర్‌ జుబైద్‌ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్‌ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె 29 ఏళ్ల ఫిర్దోస్‌ అన్సారీ ఎంబీఏ చదివింది. చార్మినార్‌ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్‌ పటేల్‌ అనే 30 ఏళ్ల యువకుడితో గతేడాది ఫిబ్రవరి 1న పెళ్లి జరిగింది. అయితే, అతనికి అనుమానం అనే జబ్బు ఉందని, ఎవరితో మాట్లాడినా భర్త అనుమానించి బెల్టు దెబ్బలు కొట్టేవాడని డైరీలో రాసుకుంది. కర్రతో కూడా చితకబాదేవాడని రాసింది. 


తన ఆడపడుచు భర్త, వారి పిల్లలతో మాట్లాడినా ఇష్టమొచ్చినట్లుగా కొట్టేవాడని వివరించింది. అయితే, తాను ఇలా చేస్తున్నట్లుగా పుట్టింట్లో గానీ, మెట్టినింట్లో గానీ చెబితే, తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించేవాడని డైరీలో రాసుకుంది. ఆమెతో ప్రైవేటుగా ఉన్న వీడియోలు అందరికీ షేర్ చేస్తానని హెచ్చరించేవాడు. గతంలో ఆమెకు రెండు సార్లు అబార్షన్ జరిగితే ఆనందపడ్డాడు. ఈ విషయాలన్నీ ఆమె డైరీలో రాసుకుంది. 


ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. తల్లిదండ్రుల వద్ద ఉండాలని హెచ్చరిస్తూ గత నెలలో భర్త పంపించేశాడు. ఈనెల 1న షాహిన్‌ నగర్‌లోని అత్త గారింటికి వచ్చి భార్యను తిడుతూ కొట్టి వెళ్లాడు. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని బాధితురాలు వేడుకుంది. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయని అందరూ తేలిగ్గా తీసుకున్నారు. దీంతో బాధితురాలు బుధవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులను తట్టుకోలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసింది. భర్త, అత్తమామలు తన మృతదేహాన్ని ముట్టుకోవద్దని కోరింది. అలా చేస్తే తనకు మేలు చేసినవాళ్లు అవుతారని చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే పరారీలో ఉండగా అతని కోసం వెతుకుతున్నారు.