హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో, పూరీ జగన్నాథ్ ఆలయం సమీపంలో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఆగస్టు 4) మధ్యాహ్నం ప్రారంభించారు. సీఎం వెంట మంత్రులు, పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య, గుమ్మడికాయలతో దిష్ఠి తీస్తూ, ప్రత్యేక పూజలు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ నిర్వహించిన శిలాఫలకాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు పోలీసులు బైక్‌లతో స్వాగతం పలికారు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎస్ సోమేశ్ కుమార్‌తో కలిసి పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్దకు అందరూ వెళ్లారు. అక్కడ పండితులు పూజలు చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే మొదటిసారిగా
దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 600 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. పోలీసు విభాగానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడో కన్నుగా చెబుతున్నారు. ఒకేసారి సుమారు లక్ష సీసీటీవీ కెమెరాలు చూసేలా కమాంట్ కంట్రోల్ సెంటర్ లో భారీ తెరను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బంది 24 గంటల షిఫ్టుల విధానంలో పని చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిక్షిప్తం చేయడానికి అతి భారీ సర్వర్లను కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు.
ఆరేళ్లుగా నిర్మాణం
2016 నవంబర్ 22న ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల వరకూ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లుగా అంచనా. వీటన్నిటినీ, అన్ని పోలీస్ స్టేషన్లను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, క్రైమ్, క్రిమినల్స్ డేటా అన్ని ఇక్కడి నుంచి నియంత్రించే వీలు కలగనుంది.
- మొత్తం భవనం 6.42 లక్షల చదరపు అడుగులు, 2.16 లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం
- భవనం మొత్తం ఎత్తు 272 అడుగులు
- టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి గా నిర్మాణం, టవర్ ఈ గా నిర్మాణం
- టవర్ ఏ 20 అంతస్తులు ఉంటుంది. ఇందులోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.
- టవర్ బి 15 అంతస్తులు ఉంటుంది. ఇందులో డయల్-100, షీ సేఫ్టీ, సైబర్, నార్కోటిక్స్, క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటాయి.
- టవర్ సి జీ+2 గా ఉంటుంది. ఇది 480 మంది కూర్చోగల ఆడిటోరియం
- టవర్ డి జీ+1 మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్
- భవనం పైభాగంలో హెలీ ప్యాడ్
- అద్దాల మేడ కావడంతో లోనికి ధారాళంగా వెలుతురు
- సోలార్ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్ విద్యుత్తు ఉత్పత్తి
- 35 శాతం స్థలంలో మొక్కల పెంపకం
- యోగా సెంటర్, జిమ్, వెల్‌నెస్ సెంటర్