Hyderabad Food Poison: హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఆహార కల్తీ హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖమైన హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను, గడువు ముగిసిన మాంసాన్ని వాడుతున్నట్లుగా ఆహార భద్రతా అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ లోని లక్డీకపూల్ లోని ద్వారకా హోటల్ లో హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రక్రియ ప్రారంభించారు.
ఖైరతాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న (మే 23) మల్కాజిగిరి ప్రాంతానికి స్రవంతి కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా హోటల్ కు వచ్చింది. హోటల్ లో క్యారెట్ హాల్వా తిన్న తరువాత ఆమెకు డీహైడ్రేషన్, కడుపు నొప్పి లాంటివి వచ్చాయి. దీంతో వెంటనే ఆమె హాస్పిటల్ కు వెళ్ళింది. అనంతరం తనకు ఫుడ్ పాయిజన్ అయిందంటూ బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి, ఫుడ్ శ్యాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్లుగా ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు.
రెండు రోజుల క్రితమే ప్రముఖ బ్రాండెడ్ హోటళ్లలో తనిఖీలు
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్‌లో తాము జరిపిన తనిఖీలకు సంబంధించి వివరాలను పోస్ట్ చేశారు. రామేశ్వరం కేప్ లో మే 23న నిర్వహించిన తనిఖీల్లో గత మార్చితోనే డేట్ అయిపోయిన 100 కిలోల మినపప్పును గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ 16 వేలు ఉంటుందని చెప్పారు. అలాగే డేట్ అయిపోయిన పది కిలోల నందిని పెరుగును, 8 లీటర్ల పాలను కూడా తాము సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. అలాగే బంజారాహిల్స్, సికింద్రాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కూడా ఆహార పదార్థాలు గడువు ముగిసినట్లుగా గుర్తించామని చెప్పారు.