Hyderabad Vanasthalipuram Girls: హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తమ తల్లిదండ్రులను, స్కూలు యాజమాన్యాన్ని, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మూడో తరగతి బాలికలు పారిపోదామని ప్రయత్నించారు. చివరికి వారి ఆచూకీ కనుగొనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..


వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత కూడా ఇంటికి రాలేదు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో క్రాంతిహిల్స్‌, హిల్‌ కాలనీకి చెందిన 9, 10 ఏళ్ల ఇద్దరు చిన్నారులు రెడ్‌ ట్యాంకు దగ్గరున్న ఒక ప్రైవేటు స్కూలులో మూడో తరగతి చదువుతున్నారు. వారిలో ఒకరు రోజూ ఆటోలో స్కూలుకు వెళ్లి వస్తుండగా.. ఇంకో బాలికను తల్లిదండ్రులు దిగబెడుతుంటారు. అదే ఆటోలో విద్యార్థిని తమ్ముడు కూడా వస్తుంటాడు. స్కూలు బెల్లు కొట్టాక.. బాలిక, ఆమె సోదరుడు ఆటోలో.. ఇంకో బాలిక తన తల్లిదండ్రులతో ఇంటికి వెళతారు. సోమవారం బాలిక సోదరుడు తన అక్క రాక కోసం ఆటోలో ఎదురు చూస్తున్నాడు. ఇంకో బాలిక కోసం ఆమె తండ్రి ఎదురుచూస్తున్నాడు. ఉదయం 11.30 గంటలకు స్కూలు వదిశారు. అరగంట గడిచినా కూడా ఇద్దరు అమ్మాయిలు రాలేదు. 


ఆటో డ్రైవర్‌, బాలిక తండ్రి కలిసి స్కూలులో సెక్యురిటీని, టీచర్లను ఆరా తీయగా.. వారు వెళ్లి చాలా సేపు అయిందని చెప్పారు. ఈ క్రమంలో వారు స్కూలులోని సీసీటీవీ కెమెరాలను కూడా చూపించారు. కెమెరాల్లో రికార్డయిన ప్రకారం.. ఇద్దరు బాలికలు నడుచుకుంటూ రెడ్‌ ట్యాంకు వైపు వెళ్తున్నట్లుగా కనిపించింది. ఆ ప్రదేశం మొత్తం వెతికినా వారు ఎక్కడా కనిపించలేదు. వెంటనే వెళ్లి వారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 


బాలికలు కనిపించకుండా పోయి కొద్ది సేపే కావడం, రెడ్ ట్యాంకు వైపు వెళ్తున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కాస్తు ముందుకు వెతకాలని నిర్ణయించారు. అక్కడే ఉన్న ఆ బాలికల స్నేహితుడైన చిన్న పిల్లవాడిని వారి గురించి అడగ్గా.. ఆ పిల్లలు పారిపోయేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారని, వారి ప్లాన్ సంగతి తనకు చెప్పారని చెప్పాడు. సుష్మా థియేటర్ రోడ్డు వైపు వెళ్తారని చెప్పాడు. వెంటనే అందరూ అప్రమత్తమై అటు వైపు వెళ్లి వెతకగా బాలికలు ఇద్దరూ సుష్మా బస్టాప్ లో కనిపించారు. 


దీంతో వారిని తీసుకొని వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. తాము హిందీ పరీక్ష బాగా రాయలేదని, సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు తమని హాస్టల్‌లో పెట్టేస్తారనే భయంతో ఇలా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.