Akbaruddin Owaisi Hate Speech Case: దాదాపు పదేళ్ల క్రితం ఈ వ్యవహారం జరిగింది. మజ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ - ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎట్టకేలకు నాంపల్లి కోర్టు (Nampalli Court) తుది తీర్పు ఇవ్వనుంది. ఆ తీర్పుపై (Nampalli Court Final Verdict) సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. నిజానికి ఈ తీర్పును నిన్ననే (ఏప్రిల్ 12) ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది.


నిర్మల్‌లోని (Nirmal) నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది.  ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) విద్వేషపూరితంగా (Hate Speech) మాట్లాడారు. ఆ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపాయి.


ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే... ‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే  మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ (రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం), 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం), 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. 


ఆ సమయంలో అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చాక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. 


ఇదే కాకుండా ఆదిలాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల పైన అనకూడని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువడనుంది. అందుకే నేడు పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.