Ambulance Siren Used For Mirchi Bazzi In Hyderabad : గతంలో ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసేవాళ్లం. కొంత స్థోమత ఉన్నవారైతే ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ కాల్ చేసి ఇంటికి పిలిచించి వైద్య సేవలు చేయించుకునేవారు. గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తితే గుర్తుకొచ్చేది అంబులెన్స్ సర్వీస్. అయితే  అలాంటి ఎమర్జెన్సీ సర్వీసును అంబులెన్స్ సిబ్బంది దుర్వినియోగం చేసి మిర్జీ బజ్జీలు తింటూ కూర్చున్నారని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమర్జెన్సీ సర్వీసులు సైరన్ ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. 


రోడ్డుపై మనం వెళ్తున్నప్పుడు అంబులెన్స్ సైరన్ మోగిందంటే ఎవరో ఆపదలో ఉన్నారు అని భావిస్తాం. ట్రాఫిక్ ఉన్నా సైతం పోలీసులు అంబులెన్స్ కు దారి క్లియర్ చేసి పంపించడం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ హైదరాబాద్ లో అంబులెన్స్ సిబ్బంది సైరన్ వినిపించి సర్వీస్ దుర్వినియోగం చేశారు. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నారాయణకూడ జంక్షన్ వద్ద సోమవారం రాత్రి సెంచురీ అస్పత్రికి చెందిన అంబులెన్స్ వచ్చింది. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకోవడం, అందులోనూ సైరన్ మోగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంటన్ అప్రమత్తమై అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేసి పంపించాడు.






సీన్ రివర్స్.. ట్రాఫిక్ పోలీస్ షాక్..
అంబులెన్స్ ఎవర్నో పేషెంట్ ను తీసుకెళ్తుందని ట్రాఫిక్ పోలీస్ భావించాడు. కానీ సిగ్నల్ నుంచి కొంత దూరం వెళ్లి అంబులెన్స్ ఆగింది. ఏమైందా అని చెక్ చేసేందుకు వెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్ ఎంచక్కా మిర్చీ బజ్జీలు తింటున్నారు. అందులో ఒకరు చల్లచల్లని కూల్ డ్రింక్ తీసుకుంటూ కనిపించారు. ఇది చూడగానే ట్రాఫిక్ పోలీస్ కు చిర్రెత్తుకొచ్చింది. అంబులెన్స్ లో పేషెంట్ లేనప్పటికీ సైరన్ ఎందుకు మోగించారు, మిర్చీ బజ్జీలు తినడానికి, కూల్ డ్రింక్స్ తాగడానికి ఎమర్జెన్సీ సర్వీసును దుర్వినియోగం చేయడంపై నర్సులను, డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీస్ ప్రశ్నించాడు. అక్కడ జరుగుతున్న తతంగాన్ని వీడియో తీశాడు. 


డీజీపీ అంజనీ కుమార్ సీరియస్..
‘అంబులెన్స్ లాంటి అత్యవసర సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే అంబులెన్స్ సైరన్ మోగించాలి. లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసు దుర్వినియోగం అవుతుంది. నిజంగానే ఎమర్జెన్సీ లేకుండా సైరన్ మోగిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ అంజనీ కుమార్ వీడియోను ట్వీట్ చేసి హెచ్చరించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial