హైదరాబాద్ స్టేట్‌లో తొలిసారి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగవేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే జాతీయ పతాకాన్ని ఎగరవేశామని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినవ సర్దార్‌ పటేల్‌ అని కిషన్‌ రెడ్డి అభివర్ణించారు. సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.



బీజేపీ పోరాటం ఫలితంగానే ఇప్పుడు విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోంది. సెప్టెంబరు 17 నిజాం నియంత పాలనకు చరమగీతం పాడిన రోజు. స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకం ఎగరేస్తుంటే నిజాం ఒప్పుకోలేదు. పాకిస్థాన్‌లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేసేందుకు సిద్ధపడ్డాడు. చివరికి ఎందరో ప్రాణాలు అర్పించారు. సెప్టెంబరు 17న తెలంగాణలో గత ప్రభుత్వాలు విమోచన వేడుకలు జరపలేదు.


మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవతో జరుపుకుంటున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విమోచన వేడుకలు జరుపుకుంటున్నాయి. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోంది. అసలు ఇన్నిరోజులు విమోచన వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు.’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.



పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నాయకులు అంతా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి, అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. కేంద్రం నిర్వహిస్తున్న ఈ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.


తెలంగాణ విమోచన వేడుకల్లో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించారు. సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. ఈ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌ కూడా హాజరయ్యారు.


Also Read: CM KCR: అది తలచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతయ్, ఆ పరిస్థితి మళ్లీ రావొద్దు - పొంచి ఉన్న ప్రమాదం: కేసీఆర్