అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో మతతత్వ శక్తులు తమ వికృత ప్రయత్నాలతో రాష్ట్ర సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ సమైక్యత దిన వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సమాజంలో తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను గ్రహించి అందరూ ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏ మాత్రం ఆదమరిచినా బాధాకరమైన సందర్భాలు ఎదురవుతాయని అన్నారు. ఒకసారి జరిగిన ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించామని అన్నారు. ఆ అస్తిత్వం నిలుపుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశామని, తెలంగాణ ఉద్యమం చేశారని అన్నారు. ఆ ఉద్యమ ఘర్షణను తలచుకుంటే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. అలాంటి వేదన మళ్లీ ఎదురు కాకూడదని అన్నారు. సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది ముళ్ల కంపలు నాటుతున్నారని అన్నారు. విద్వేష మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మనుషుల మధ్య ఈ విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని అన్నారు.


తెలంగాణ సమాజం బుద్ధి కుశలత ప్రదర్శించి స్వరాష్ట్రం సాధించుకుందని, అదే క్రియాశీలతతో వ్యవహరించి జాతి జీవ నాడి తెంచాలని చూస్తున్న వారిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం లోతులో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సును కాంక్షించే బాధ్యత గల వ్యక్తిగా చెబుతున్నానని, ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అశాంతి, అభద్రత, అలజడులతో అట్టుడికి పోవద్దని అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. 


అమరవీరులను గుర్తు చేసుకున్న సీఎం


‘‘ఈ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం. వారందరి స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందాం. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుందాం.’’ అని కేసీఆర్ గుర్తు చేశారు.


1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింద‌ని తెలిపారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని అన్నారు. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నామని అన్నారు. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామ‌ని కేసీఆర్ చెప్పారు.