తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి ఓ యువతి ప్రాణాలు కాపాడింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు మానవత్వం చాటడంలోనూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) సిబ్బంది భేష్‌ అనిపించుకున్నారు. రోజూ లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందిస్తోంది. పొరపాటున ఎవరైనా తమ వస్తువులు బస్సులో మర్చిపోతే, సహజంగా ఆర్టీసి సిబ్బంది ఏం చేస్తుంటారు. ఆ వస్తువులను తీసుకెళ్లి డిపోలో ఇచ్చేస్తున్నారు. ఒకవేళ వివరాలు ఉంటే వారికి చేరుతుంది. లేకపోతే పోగొట్టుకున్న వాళ్లు వచ్చి తమ వస్తువులు, బ్యాగులు తీసుకెళ్తుంటారు. 
తాజాగా ఓ యువతి ఆర్టీసి బస్సులో మర్చిపోయిన పర్సు, ఆ యువతి ప్రాణాలు కాపాడేలా చేసింది. పర్సు మర్చిపోయింది మనకెందుకులే అని లైట్ తీసుకోకుండా ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహిరించడంతో పాటు మానవవత్వం చాటుకున్నారు. పర్సులో యువతి వివరాలు వెతికే ప్రయత్నంలో సూసైడ్ లెటర్ పర్సులో ఉండటం గుర్తించారు. ఎవరు ఎలా పోతే మనకేంటి అని లైట్ తీసుకోకుండా వెంటనే ట్విట్టర్ లో యువతి వివరాలు పెట్టి రక్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ట్వీట్ ను ఆర్టీసి ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందంటే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ యువతి ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ ఘటన జరిగింది. 


అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి నారాయణఖేడ్‌ డిపో బస్సును ఆదివారం పటాన్‌చెరువులో ఎక్కి జేబీఎస్‌లో దిగింది. కావాలని చేసిందో, లేక అనుకోకుండా మర్చిపోయిందో ఆ యువతి తన వెంట తెచ్చుకున్న పర్సును బస్సులోనే మర్చిపోయింది. బస్సు సీటులో పర్సు గమనించిన కండెక్టర్ వెంటనే ఎవరిదో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పర్సు తెరిచి చూసాడు బస్సు కండక్టర్ పి.రవీందర్. పర్సులో గుర్తింపు కార్డులతో పాటు సూసైడ్ లెటర్ ను కండక్టర్ గుర్తించారు. యువతి ఆధార్‌ కార్డుతోపాటు రూ.430 నగదు అందులో ఉంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే చనిపోవాలని అనుకుంటున్నానని సూసైడ్‌ లెటర్‌లో రాసి ఉంది. అది చదివిన కండక్టర్‌ రవీందర్‌ వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. సూసైడ్‌ లెటర్‌తో పాటు ఆధార్‌ కార్డు ఫొటోలను షేర్‌ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్‌ ఆర్టీసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేబీఎస్‌లో దిగిన ఆ యువతిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.


సజ్జనార్ ఆదేశాలతో ఆర్టీసీ ఎస్సై దయానంద్, ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు. యువతి గుర్తింపు కార్డును చూపుతూ వెతకడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు పర్సులో సూసైడ్ లెటర్ పెట్టి ఆత్మహత్యకు సిద్దమైన ఆ యువతిని గుర్తించారు. మారేడ్‌పల్లి పోలీసుల సాయంతో ఆమెను వారి కుటుంబసభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహారించి యువతి ప్రాణాలను కాపాడిన టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌  అభినందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చిన కండక్టర్‌ రవీందర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.