Beneficiaries identified for double bedroom houses:
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి అర్హులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అపోహలను, దళారులను నమ్మవద్దన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 1400 దరఖాస్తులు లాగా అందులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి అర్హులైన 489 మంది లబ్ధిదారులను గుర్తించారని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులను వేయాలన్నారు. ఫిర్యాదులను అధికారులు పరిగణలోకి తీసుకొని తిరిగి రీ సర్వే చేస్తామని చెప్పారు. 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయని, నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎలాంటి పైరవీలకు తావులేదని, ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈనెల డిసెంబర్ 28వ తేదిన హుస్నాబాద్ శివారులోని శుభం గార్డెన్ లో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నిజమైన లబ్ధిదారులకే ఇళ్ల పంపిణీ...
అర్హులను ఎంపిక చేయడానికి దరఖాస్తుదారుల స్థితిగతులు, గతంలో ఇళ్ల పంపిణీ పథకంలో లబ్దిపొంది ఉన్నారా లేదా అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను తమకు కేటాయించాలని జిల్లావ్యాప్తంగా దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటం, అప్లికేషన్ పెట్టుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అర్హుల ఎంపిక అధికారులకు ఇబ్బందికరంగా ఉంది. ఈ తరుణంలో దరఖాస్తుదారుల ఆర్థికస్థితి.. నిజంగా ఆర్హులైనవారు దరఖాస్తు చేసుకున్నారా, అనర్హులు ఉంటే వారిని ఎలా తొలగించాలని అనే విధంగా దరఖాస్తుదారుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి దరఖాస్తు దారుని ఇంటికి వెళ్లి వారి స్థితిని పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల ఇళ్లను పంపిణీ చేయగా డ్రా పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈసారి ఎక్కువ మొత్తంలో ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎలా అర్హులను ఎంపిక చేయాలో ప్రభుత్వం మార్గద ర్శకాలను జారీ చేస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఈ అంశంపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జనవరి 10 నాటికే డబుల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.