సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన భవనం కూల్చే సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఏమైనా నష్టం జరిగితే దానిని భర్తీ చేసే బాధ్యత తమదేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికులకు హామీ ఇచ్చారు. మినిస్టర్ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనాన్ని మంత్రి తలసాని, అధికారులతో కలిసి శనివారం మరోసారి సందర్శించారు. క్రేన్ సహాయంతో కాలిపోయిన భవనం శిథిలాలను పరిశీలించారు. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. ఇంకా మంటలు చల్లారకపోవడంతో ఫైర్ అధికారులు ఫోమ్ తో స్ప్రే చేస్తున్నారని వెల్లడించారు. 


ప్రమాదం జరిగిన భవనాన్ని మరోసారి పరిశీలన 
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని శనివారం అధికారులతో కలిసి వెళ్లి మంత్రి తలసాని సందర్శించి, శిథిలాలను పరిశీలించారు. భవనం వెనుకాల ఉన్న మరొక్క భవనంపైకి ఎక్కి ప్రమాదం జరిగిన భవనాన్ని మరోసారి పరిశీలించారు. బస్తీవాసిలు మూడు రోజుల నుంచి తాము పడుతున్న అవస్థల గురించి మంత్రి తలసానికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇది ఊహించని దుర్ఘటన అన్నారు. ఈ ఘటన వలన చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి స్థానికులను సురక్షిత స్థలానికి తరలించారని పేర్కొన్నారు. వారికి మూడు పూటలా భోజనాలు కూడా అందించడం వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుందని అన్నారు.


జనసంద్రాల మధ్య ఇటువంటి గోదాముల రావడం అగ్నిప్రమాదం జరగడం వలన తీవ్ర నష్టం జరగడం బాధాకరం అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏమి చేయాలనే విషయాలను పరిశీలించి చర్యలు తీసుకునేందుకు ఈ నెల 25న ఒక ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. ఈ కమిటీ జనసంద్రాల మధ్య ఉన్న వాటిని ఏమి చేయాలి రెండోది ఫైర్ సేఫ్టీ లేని వారిని, జిహెచ్ఎంసీ అనుమతులు లేని వారిని ఏమి చేయాలనే విషయాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ప్రకారం చర్యలు చేపడతాము. దీని వలన కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు కానీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని అన్నారు. 


కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు. ఘటనపై బాధ్యతా రహితంగా మాట్లాడడం బాధాకరం అన్నారు. భవనాల క్రమబద్దీకరణ పథకం 2008లొనే ఆగిపోయిందన్న విషయం తెలియకుండా భవనాల క్రమబద్దీకరణ ద్వారా జిహెచ్ఎంసీ డబ్బులు దండుకుంటుందని కిషన్ రెడ్డి ఆరోపించడం దురదృష్టకరమ అన్నారు. ప్రజలకు భరోసా కల్పించే విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయడం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి తలసాని హితవు పలికారు. 


జునైద్ మృతదేహం లభ్యం 
ఈ అగ్ని ప్రమాదం ఘటనలో తొలిరోజు కొందర్ని రక్షించగా.. లోపల చిక్కుకుపోయిన ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను ఇప్పటికే దారుణమైన స్థితిలో వెలికితీశారు. మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం జునైద్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. జునైద్ మృతదేహం వెంట అతడి కుటుంబ సభ్యులు వెళ్లారు.