TS News Developments Today: వరంగల్ రామప్ప ఫెస్టివల్‌లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడా గ్రౌండ్‌లో నేటి(శనివారం) సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మల్లిక సారాభాయ్ బృందం నృత్య ప్రదర్శన చేయనున్నట్టు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రభుత్వ సలహాదారు పాపారావు తెలిపారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2008లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చాక.. ఇక్కడ ఫెస్టివల్ నిర్వహించేందుకు కేంద్ర ఆర్కియాలజీ, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసినా అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో కాకతీయుల నగరమైన హనుమకొండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మల్లిక సారాభాయ్ 15 మంది బృందంతో 17 నిమిషాల పాటు ‘నటరాజ వందనం’ నృత్య ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు.
నేడు కరీంనగర్ పర్యటనకు రానున్న జస్టిస్ ఈవీ వేణుగోపాల్
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాల 60వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఇ.వి. వేణు గోపాల్ హాజరు కానున్నారు. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థిగా చదివి నేడు హైకోర్టు జడ్జిగా హాజరువుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించి అనంతరం మొదటిసారి కరీంనగర్ వచ్చిన సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆగ్నేయ గాలులతో చలి
దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే చలి పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో 11 నుంచి 15 డిగ్రీల వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 11, హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.