Hyderabd Traffic: హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ గురించి భయపడిపోతుంటారు చాలా మంది. సొంత వాహనాల్లో వెళ్లే వారైనా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడే వారైనా ట్రాఫిక్ కు జంకుతుంటారు. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుందే తప్పా తగ్గడం లేదు. చాలా మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడే వారి కంటే బైకులు, సొంత కార్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో.. రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. వర్షాలు పడినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటలకొద్దీ జామ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో స్థోమత పెరిగిపోవడంతో చాలా మంది కార్లు తీసుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా పనిపై బయటకు వెళ్లినా కార్లను రోడ్లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. బైకులు వాడే వారు కూడా కార్లు ఉంటే వాటిలోనే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు నిర్మించినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య ఐటీ కారిడార్ పరిధిలో మరీ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు వరుసగా ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ పెరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఐటీ ఉద్యోగులు చాలా వరకు కార్లనే వాడుతుండటం.. ఎక్కువ శాతం మంది కారులో ఒకరు మాత్రమే ప్రయాణిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు.
ఐటీ కంపెనీలకు పోలీసుల సూచనలు
ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ స్టీఫెన్ భేటీ అయ్యారు. ఐటీ కారిడార్ లో కార్ పూలింగ్ విధానంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు చర్చించారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు సొంత రవాణా సదుపాయాన్ని కల్పించాలని పోలీసులు ప్రతిపాదించారు. ఐటీ ఉద్యోగులు అంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పని వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. అలాగే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు.
Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు
కార్ పూలింగ్ అంటే ఏంటి?
ఒక్కరి కోసం కారు వాడటం వల్ల రోడ్లన్నీ జామ్ అవుతాయి. అలాగే కాలుష్యం కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు.. కొత్త ఆలోచన చేశారు. కార్ పూలింగ్ విధానం ప్రవేశ పెడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలు అవుతోంది. హైటెక్ సిటీలో కార్ పూలింగ్ విధానం అమలు చేయడం వల్ల సగం వరకు సమస్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు.