Hyderabad Traffic News:హైదరాబాద్‌లో ఈ ఉదయం (జూలై 22) నుంచి భారీ వర్షం కురుస్తున్న వేళ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో అక్కడక్కడ ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ మూమెంట్ చాలా నెమ్మదిగా ఉంటోందని, చాలా చోట్ల భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు.
సాధారణంగా ఉదయం 8 నుంచి 10.30 మధ్య నగరంలో కార్యాలయాలకు వెళ్లేవారితో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. దానికితోడు అదే సమయంలో కాసేపు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లపైనే నీళ్లు నిలిచాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, చాలా చోట్ల వాహనాలు బారులు తీరాయి. అయితే, ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటనలో తెలిపారు.
కాబట్టి, వర్షం నేపథ్యంలో వాహనదారులు తమ వీలును బట్టి, ఒక గంట ఆలస్యంగా బయలుదేరాలని, ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడాలని సూచించారు. దీంతో రోడ్లపై నిలిచిన నీళ్లను డ్రైన్లలోకి పంపే పనులు చేసేందుకు వీలవుతుందని చెప్పారు. తొందరగా వెళ్లాలనే ఆత్రుతతో రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవద్దని సూచించారు. రోడ్లపై నిలిచిన నీరు పోయాకే రావాలని చెప్పారు. లేదంటే సీరియస్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవాల్సి వస్తుందని వెల్లడించారు.
మరోవైపు, వైఎంసీఏ, ఎస్‌బీహెచ్ ఎక్స్‌రోడ్స్, పారడైజ్ ఎక్స్ రోడ్స్ నుంచి ఆనంద్ థియేటర్ మార్గంలో చాలా నెమ్మది ట్రాఫిక్ ఉందని ట్వీట్ చేశారు.
మలక్ పేట్ మెట్రో స్టేషన్, మలక్ పేట్ యశోద హాస్పిటల్, నల్గొండ ఎక్స్ రోడ్స్, మలక్ పేట్ రైల్వే స్టేషన్, అజాంపుర, చాదర్ ఘాట్ రోటరీ వద్ద ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ఉందని మరో ట్వీట్ చేశారు.