Minister KTR: ఎన్డీఅర్ఎఫ్(NDRF)కు ఎస్డీఅర్ఎఫ్(SDRF)కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం అంటూ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారు. అలాగే ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక నిధుల పైన కిషన్ రెడ్డికి అవగాహణ లేదంటూ వ్యంగ్యంగా చెప్పారు. కేంద్రం ఎన్డీఅర్ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగ బద్దంగా, హక్కుగా దక్కే ఎస్డీఅర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన ఎస్డీఅర్ఎఫ్ కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి నయాపైసా కూడా ఇవ్వలేదు..
2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేంద్రం అదనంగా ఇయ్యలేదని లోక్ సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణను ఎవరు మోసం చేస్తున్నారో ఈ విషయాలు చూస్తేనే అర్థం అవుతుందంటూ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారు. బేజీపీ అధికారంలో ఉన్న బిహార్ కు 3,250 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు 4,530 కోట్లు, కర్ణాటకకు 6,490 కోట్లు, గుజరాత్ కు 1,000 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధులు అందించిన విషయం వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ర్టాలకు 15,270 కోట్లు ఇచ్చిన కేంద్రానికి తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని అన్నారు.
నిధులు అడిగే ధైర్యం లేక అబద్ధాలు..
గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా ప్రధాన మంత్రే ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి 2021లో 1000 కోట్ల ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేసింది వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించని ప్రధాని మోడీ వివక్ష పూరిత వైఖరిని ఎండగట్టడం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. అయా రాష్ట్రాల మాదిరే తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఅర్ఎఫ్ ద్వారా అందించిన అదనపు నిధులు ఎన్నో దమ్ముంటే కిషన్ రెడ్డి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్ గా ఉన్న హైలెవెల్ కమీటి ఇచ్చే ఎన్డీఅర్ఎఫ్ అదనపు నిధులు అడిగే దైర్యం లేక కిషన్ రెడ్డి అబద్దాలు చేబుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి నయా పైసా సాయం తీసుకురాని చేతకాని మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..
అబద్ధాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు చేయాల్సిన వరద సహాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చేబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కలిసి రాకుండా ఎప్పటిలాగే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్లజ్జగా అబద్దాలు చెపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.