ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల రోజూ ఉదయం ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నివేదికలు, వార్తా కథనాలను ఎత్తి చూపుతూ బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాల వల్లే ఇలా జరుగుతోందంటూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా నేడు కూడా బీజేపీ నేతల్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ‘మోదీ అండ్ ఈడీ’ అని అన్నారు.
టైమ్స్ గ్రూపులో వచ్చిన ఓ కథనాన్ని ఉటంకిస్తూ మంత్రి కేటీఆర్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ కథనంలో ఉన్నాయి. త్వరలోనే కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.
మరో ట్వీట్‌లో భారత్‌లో రెండు వాస్తవాలు జరిగాయని అన్నారు. ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్ నైజీరియాను అధిగమించిందని విమర్శించారు. మరోవైపు బిల్ గేట్స్ ను అధిగమించి ఆదానీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగారని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వార్తా కథనాలను కూడా జత చేశారు.
‘‘మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకవైపు, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను ఏడాదికి 1.45 లక్షల కోట్ల రాయితీ ఇచ్చింది. మరోవైపు, బియ్యం, పెరుగు, గోధుమ, మజ్జిగ లాంటి సామాన్యుడి నిత్యావసరాలపై పన్నులను పెంచింది. కార్పొరేట్లకు ట్యాక్స్ కట్, కామన్ మ్యాన్‌పైన ట్యాక్స్ హైక్’’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.