హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ - రోడ్ నెంబరు 45 - జర్నలిస్టు కాలనీ మధ్య ట్రాఫిక్ తగ్గించే లక్ష్యంతో నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన కొత్త ప్రయోగంపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ ట్రాఫిక్ మళ్లింపుల తీరు బాగా తికమకగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. వాహన రద్దీ తగ్గించాలని పోలీసులు కొత్తగా వేసిన ఈ ప్లాన్, వాహనాలు సాఫీగా వెళ్లడం మాట అటుంచితే, ట్రాఫిక్ మరింత పెరిగింది. అనేక చోట్ల యూ టర్న్ లు ఉండడం, వాహన చోదకులు కన్‌ఫ్యూజ్ అయి మెల్లగా వాహనాలు నడుపుతుండడం కూడా వాహనాల రద్దీ పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది. 


వాహనాల రద్దీగా ఉన్న సమయంలోనూ అసలైన దారిలో వెళ్తే పట్టే సమయం కన్నా ఈ డైవెర్షన్‌ల మార్గాల ద్వారా వెళ్తే పావు గంట నుంచి అర గంట వరకూ ఎక్కువ సమయం పడుతోందని చెబుతున్నారు. దీంతో సరైన సమయానికి గమ్యస్థానం చేరలేకపోతున్నామని, ఆఫీసులకు ఆలస్యం కూడా అవుతుందని చెబుతున్నారు.


జూబ్లీహిల్స్‌ చుట్టూ 8 ప్రాంతాలను అత్యధిక ట్రాఫిక్‌ ఏరియాలుగా ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులు అమలు చేస్తున్నారు.


కొత్తగా మార్చిన ప్లాన్ ఇదీ..
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపునకు వెళ్లాలనుకొనే వాహనదారులు ఆ జంక్షన్ నుంచి రోడ్ నెంబరు 36 మీదుగా (మెట్రో లైను మార్గంలో) నేరుగా వెళ్లిపోవాలి. వారు ఈ రూట్స్ ఉపయోగించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు


1. మెట్రో పిల్లర్ నెంబర్ 1650 (క్రీమ్‌స్టోన్ తర్వాత) లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబరు 54 మీదుగా రోడ్ నెంబరు 45కి (కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కిందికి) చేరుకోవచ్చు. అక్కడి నుంచి కుడి వైపునకు తిరిగి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకోవచ్చు.


2. క్రోమా తర్వాత ఎడమ వైపునకు తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 39 మీదుగా మంగోలియా బేకరీ వద్ద రోడ్ నెంబరు 45కి చేరుకోవచ్చు. Zozoz Pizzeria Restaurant వద్ద యూటర్న్ తీసుకొని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మార్గంలోకి వెళ్లొచ్చు.
రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద నో రైట్ టర్న్


3. ప్రస్తుతం వాహనదారులు అందరూ వెళ్తున్న దారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ - లెఫ్ట్ టర్న్ - రోడ్ నెంబర్ 45 జంక్షన్ - రైట్ టర్న్ కాగా, ఇకపై ఇక్కడ రైట్ టర్న్ ను మూసేయనున్నారు. జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ వద్ద కూడా రైట్ టర్న్ ను అనుమతించరు.


4. కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద నుంచి లేదా ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో వాహనదారులను రోడ్ నెంబరు 45 జంక్షన్ వరకూ అనుమతించరు. వారు రోడ్ నెంబరు 54 (హార్ట్ కప్) వద్ద లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబర్ 36పైనున్న ఫ్రీడమ్ పార్క్ మెట్రో పిల్లర్ నెంబర్ 1663 వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఇక రోడ్ నెంబర్ 36 పైన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లిపోవచ్చు.


5. కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చేవారు బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ/ఫిల్మ్ నగర్ జంక్షన్ వెళ్లేవారు హార్ట్ కప్ వద్ద యూటర్న్ తీసుకొని, గీతా ఆర్ట్స్ ఆఫీసు/బ్రాడ్ వే వైపు రావాలి. వారు రోడ్ నెంబర్ 51లోకి వెళ్లి పక్షి సర్కిల్ నుంచి న్యాయ విహార్.. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకొని బాటా మీదుగా ఫిల్మ్ నగర్ జంక్షన్ చేరుకోవచ్చు.


6. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వారు ఒరిస్సా ఐలాండ్/కళింగ భవన్/అగ్రసేన్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు. అలా వారు రోడ్ నెంబర్ 45 రాకుండా ఉండవచ్చు.


7. ఫిల్మ్ నగర్/సీవీఆర్ జంక్షన్ నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపునకు వెళ్లాలంటే నేరుగా వెళ్లడం కుదరదు. వీరు రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని హార్ట్ కప్ వరకూ వెళ్లి కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లాలి. 


8. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా రోడ్ నెంబర్ 45 జంక్షన్ కి వచ్చేవారిని నేరుగా ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అనుమతించరు. వారు ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్ తీసుకొని సీవీఆర్ జంక్షన్ మీదుగా జర్నలిస్టు కాలనీ, రోడ్డు నెంబరు 45 జంక్షన్ కి వెళ్లొచ్చు.


9. ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్/ఓమేగా హాస్పిటల్ వైపు వెళ్లేవారు ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకోనివ్వరు. వారు సీవీఆర్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ - ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి నేరుగా రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లిపోవచ్చు.