తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. అందుకోసం కొన్ని షరతులు విధించింది. అయితే, యాత్ర భైంసా పట్టణం నుంచి వెళ్లకూడదని, అవసరమైతే భైంసాకు మూడు కిలో మీటర్ల దూరంలో సభ జరుపుకోవచ్చని సూచించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. శాంతి భద్రతలను పూర్తిగా పోలీసులే కాపాడాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోమని బండి సంజయ్‌కు సూచించిన హైకోర్టు... మరికొన్ని షరతులు విధించింది. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని సూచించింది. ఇతర మతస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు వద్దని ఆదేశించింది. సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని తెలిపింది. సభకు మూడు వేల మంది కంటే ఎక్కువ మందిని అనుమతించి వద్దని కూడా వారించింది. కార్యకర్తల చేతిలో ఆయుధాలు, కర్రలను తీసుకెళ్లొద్దని కూడా తెలిపింది. పాదయాత్ర కూడా ఐదువందల మందితో చేయాలని చెప్పింది. 


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు ఐదో విడదత పాదయాత్రపై నిన్న రాత్రి నుంచి హైడ్రామా నడుస్తోంది. ఇదివరకే నాలుగు విడతల పాదయాత్ర ముగియగా, ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి(నవంబర్ 28) నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ అనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్ పాదయాత్రకు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ స్పష్టం చేశారు. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ బైంసా నుంచి ప్రారంభించి, కరీంనగర్‌లో భారీ సభతో ముగించాలని తొలుత భావించారు. 


ఐదో విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా బండి సంజయ్ నిర్మల్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల దాటాక ఆయన్ని అడ్డుకున్నారు. బండి సంజయ్ వెనక్కి తిరిగి వెళ్లకపోవడంతో జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, బీజేపీ శ్రేణుల సహాయంతో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకుని కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లారు. అక్కడ పోలీసులు ఆయనతో మాట్లాడి తిరిగి ఇంటికి పంపించేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఆయన తిరిగి కరీంనగర్ వచ్చేశారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు.