Hyderabad Realtors Murder: హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం సమీపంలో రెండు రోజుల క్రితం ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు (Ibrahimpatnam Realtors Murder) జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస రెడ్డి, రాఘవేందర్ రెడ్డి చనిపోయారు. సంచలనం సృష్టించిన ఈ ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును తాజాగా రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఛేదించారు. ఘటన జరిగిన రెండు రోజుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మట్టా రెడ్డి గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మట్టా రెడ్డి వీరిని చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను పురమాయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటికి వచ్చింది. దీంతో మట్టారెడ్డి, నవీన్‌ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని నేడు (మార్చి 3) సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.


ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు (Gun Fire in Hyderabad) జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి 10 ఎకరాల భూమి కొన్నాడు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టా రెడ్డి దాన్ని కబ్జా చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్‌, మరో వ్యక్తితో కలిసి సైట్‌ దగ్గరికి వెళ్లగా, అక్కడే ఉన్న మట్టా రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా.. రాఘవేందర్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు.


హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టా రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయింది. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపి.. మట్టా రెడ్డి సుపారీ గ్యాంగ్‌తోనే ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాంకేతిక ఆధారాలపైన కూడా దృష్టి పెట్టి, పోలీసులు మృతుల కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు. కొన్ని నెలలుగా వీరిద్దరూ సెటిల్​మెంట్​ చేసిన భూముల వివరాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు.