లక్షా అరవై వేలు చెల్లిస్తే చాలు డిగ్రీతోపాటు ఉద్యోగం అంటూ ఫేక్(Fake ) ప్రచారంతో అమాయకులను బుట్టలో వేసుకొనే బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫ్‌ నగర్‌ ప్రాంతంలో చాలా మంది ఈ ముఠా బారిన పడి మోసపోయారు. 


నిరుద్యోగులే టార్గెట్‌గా ఈ ముఠా రెచ్చిపోయింది. లక్షా అరవైవేలు నగదు చెల్లించండి చాలు నకిలీ సర్టిఫికేట్ తో ఉద్యోగం గ్యారెంటీ అంటూ నమ్మించి నట్టేట ముంచింది. అలాంటి బాధితుల్లో దినేష్ కుమార్ అనే యువకుడు ఆసిఫ్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద లక్షా అరవై వేలు రూపాయలు తీసుకుని మోసం చేసారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు. బాధితుడు ఇచ్చిన వివరాలతో ప్లాన్ చేసి నిందితులను రౌండప్‌ చేశారు. తమదైన శైలిలో విచారించడంతో మోసాల చిట్టా బయటపెట్టారు. 


నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి తమ ఫేక్ ప్లాన్‌ను వర్కౌట్ చేశారు. వారికి ఉన్నత చదువులు చదివినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు సృష్టిస్తామని వాటితోనే ఉద్యోగాల్లో చేరిపోవచ్చని కలఫుర్ పిక్చర్ చూపించారు. 


వాళ్ల అసలు సినిమా తెలియని అమాయకులు నమ్మి లక్షలు ముట్టచెప్పారు. అందినకాడికి దండుకొని ఉడాయించడం వీళ్ల అసలు ప్లాన్. ఇన్నాళ్లకు ఈ కేటుగాళ్ల పాపం పండింది. పోలీసులకు చిక్కిన తర్వాత విచారణలో తమ మోడెస్ ఆపరండీని వివరించారు ఈ కంత్రీగాళ్లు. 


ఫేక్ సర్టిఫికేట్‌లతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు వారి వద్ద నుంచి ఓ లాప్ టాప్, తొంబై ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు, నాలుగు నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.