Telangana Weather News | హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా వర్షాలు అంతగా కురవడం లేదు. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లి, అల్విన్ కాలనీ ఏరియాల్లో వర్షం పడుతోంది. నాలాలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు వర్షం పడినప్పుడల్లా సూచిస్తుంటారు. రెండు గంటల పాటు నగరంలో వర్షం కురువనుంది. ఓ అరగంట వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తే, ఆ తరువాత తేలికపాటి జల్లులు పడతాయని వెదర్ అనలిస్ట్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 




ఆ మధ్య రెండు వారాలు వానలు లేకపోవడంతో కొన్నిరోజులుల తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు వరుణుడు అలా పలకరించి వెళ్తున్నాడు. దాంతో నగరంలో రాత్రివేళ చలి పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. వీకెండ్ కావడంతో ట్రాఫిక్ సమస్య కొంతమేర తక్కువగా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 






తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, నాగర్ గూడ, మొయినాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకావం ఉంది. రెండు నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది.






Also Read: స్మార్ట్ సిటీ మిషన్​గడువు పొడిగింపు - రేవంత్​రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం