నిన్నటిదాకా వేసవి తరహా ఉష్ణోగ్రతలను అనుభవించిన తెలంగాణ ప్రజలకు ఒక్కసారిగా కుండపోత వర్షం పలకరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉదయం నుంచే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం (సెప్టెంబరు 2) రాత్రి నుంచే నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
నగరంలోని హైటెక్ సిటీ, మాదాపూర్, కృష్ణానగర్, కూకట్ పల్లి, ఫిలింగర్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, షేక్‌పేట్, మణికొండ, అమీర్ పేట్, రాయదుర్గం, టోలిచౌకి, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతూ ఉంది. అంతేకాకుండా, బోయిన్ పల్లి, బాలనగర్, చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతూ ఉంది. హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.