Hyderabad Crime News: మృత్యువు మనిషిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కబలిస్తుందో ఎవరికి తెలియదు. ఓ ఆటో కార్మికుడిని విధి అలాగే వెక్కిరించింది. చెట్టు రూపంలో మృత్యువు ఆటో డ్రైవర్‌ను కబలించింది. హృదయాన్ని కలచివేసే ఘటన భాగ్యనగరం హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్‌లో ఆగి ఉన్న ఆటోపై భారీ వృక్షం కూలి డ్రైవర్ మృత్యువాత పడ్డాడు.
 
ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. హైదరాబాద్‌​లోని సోమజిగూడ ఎమ్​ఎస్ మక్త ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ పాషా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హిమాయత్ నగర్ నుంచి బషీర్‌​బాగ్ వైపు బయల్దేరాడు. హైదర్‌​గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో పాషా ఆటోను నిలిపాడు. అదే అతని పాలిట శాపమైంది. ఆ సమయంలో పక్కనే ఫుట్‌​పా‌‌‌త్‌​పై ఉన్న భారీ వృక్షం మత్యువులా మారి ఒక్కసారిగా ఆటోలపై పడింది. 






ఘటనలో గౌస్​ పాషా ఆటో ధ్వంసమైంది. దానిలో చిక్కుకున్న పాషా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో ఆటో ధ్వంసమైంది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పెద్ద చెట్టు కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైగా చెట్టు విద్యుత్ తీగలపై పడడంతో ప్రజలు కొంత మంది షాక్ భయంతో పరుగులు తీశారు. 


ఈ ఘటన కారణంగా ట్రాఫిక్​ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.  స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పోలీసులు భారీ వృక్షాన్ని తొలగించారు. పాషా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఘటనపై నారాయణగూడ పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక హిమాయత్‌ ​నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. చెట్టును వేగవంతంగా తొలగించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్‌​నగర్ డివిజన్​లో 14 చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. 


నిత్యం రోడ్లపై వాహనాలు తిరుగుతూ ఉంటాయని, చెట్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియదన్నారు. ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కార్పొరేటర్ మండిపడ్డారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.


ఇప్పటికైనా తొలగించండి
కళ్ల ముందే చెట్టుకూలి ఒక వ్యక్తి మరణించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. రోడ్ల పక్కన భారీ వృక్షాలు ప్రమాదకరంగా కూలిపోయే స్థితిలో దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి నగరంలో రోడ్ల పక్కన ప్రజల ప్రాణాలు తీసేలా, ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని వేడుకుంటున్నారు. భవిస్యత్తులో మరొకరి ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.