Deepti Murder Case : జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ యువతి దీప్తి డెత్ మిస్టరీ వీడింది. ఎస్పీ భాస్కర్ పూర్తి వివరాలు వెల్లడించారు. చెల్లి చందన స్నేహితుడితో కలిసి దీప్తిని హత్య చేసింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకుంది. బాయ్ ఫ్రెండ్, అతని తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్ తో కలిసి చందనే మర్డర్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందని ఎస్పీ తెలిపారు. మతాంతర వివాహాన్ని దీప్తి పేరెంట్స్ ఒప్పుకోలేదని ఆమెను చంపి ఓడ్కా తాగి మృతి చెందినట్లు నమ్మబలకాలని చూశారని తెలిపారు. అనంతరం 70 తులాల బంగారం, రూ. 1.20 లక్షలు నగదుతో పరారయ్యారని ఎస్పీ ప్రకటించారు.
బంక చందన 2019లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ చదువుతుండగా నెల్లూరు వాస్తవ్యుడైన సీనియర్ విద్యార్థి ఉమర్ షేక్ సుల్తాన్‌తో ప్రేమ ఏర్పడి పెళ్లి చేసుకోవాలని చందన ఒత్తిడి చేసింది. జీవితంలో ఇంకా సెటిల్ కాలేదని అతడు చెప్పగా ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుండి పారిపోదామని ఒప్పించిన చందన. ఇంట్లో నుండి బంగారం, నగదు తీసుకొని వెళ్తుండగా అడ్డుకున్న దీప్తిని చంపేసి వెళ్లిపోయారు.
కోరుట్ల భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి, చందన, సాయి ముగ్గురు సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. చందన బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో ఆగస్టు 27 శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆగస్టు 28 రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. ఆగస్టు 29 మధ్యాహ్నం ఫోన్ చేయగా దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇచ్చాడు. దీంతో వారొచ్చి చూడగా... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు.
దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి చెల్లి చందన, ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు. తన అక్కను తానే చంపినట్లు చందన ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.