IND vs PAK, Asia Cup 2023: గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచి చూసిన తరుణం రానే వచ్చింది.  ఆసియా కప్ - 2023లో భాగంగా భారత్ - పాకిస్తాన్  మ్యాచ్ ఎట్టకేలకు మొదలైంది. వర్షం  ముప్పు పొంచి ఉందన్న  ఆందోళనల నడుమ శ్రీలంకలోని  పల్లెకెలె (క్యాండీ) వేదికగా   జరుగుతున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో  భారత జట్టు సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు.  టాస్ గెలిచిన వెంటనే  హిట్ మ్యాన్ మరో అనుమానం లేకుండా బ్యాటింగ్  ఎంచుకున్నాడు. ఈ  మ్యాచ్‌తోనే భారత్  ఆసియా కప్‌ను ఆరంభిస్తుండగా  పాక్‌కు ఇది రెండో మ్యాచ్. 


ఈ మ్యాచ్‌లో  ఆడబోయే తుది జట్టును  పాకిస్తాన్ ఇదివరకే ప్రకటించగా..  భారత్  టాస్ తర్వాత ప్రకటించింది.  వెన్ను గాయంతో బాధపడి  సర్జరీ చేయించుకున్న  శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టుతో చేరాడు.  సూర్యకు తుది జట్టులో చోటు దక్కలేదు.  ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు,  ఒక స్పిన్నర్ (జడ్డూతో కలిపి ఇద్దరు), ముగ్గురు పేసర్లతో  భారత్ బరిలోకి దిగుతున్నది. పేసర్లలో షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తుదిజట్టులోకి దించింది భారత్. 


వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు టీమ్‌గా  ఉన్న పాకిస్తాన్.. నాలుగేండ్ల తర్వాత భారత్‌తో వన్డే ఆడుతున్నది.  చివరిసారిగా ఈ రెండు జట్లూ   2019 వన్డే వరల్డ్ కప్‌ (భారత్‌దే విజయం) లో తలపడ్డాయి. వన్డేలలో  పాకిస్తాన్ చివరిసారి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచింది.  ఆసియా కప్‌లో కూడా  వన్డే ఫార్మాట్‌లో  భారత్‌పై పాక్ గెలిచి  తొమ్మిదేండ్లు దాటింది.   ఆసియా కప్‌ (వన్డేలు) లో భారత్.. పాకిస్తాన్‌పై చివరిసారి 2014లో  గెలిచింది. 2018లో ఇరు జట్లూ రెండు సార్లూ తలపడగా రెండింటిలోనూ భారత్‌నే విజయం వరించింది. 


ఇరు జట్లూ వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా   ఆసియా కప్‌కు బరిలోకి దిగుతున్న విషయం విదితమే. భారత బ్యాటింగ్  వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్‌గా నేటి మ్యాచ్ జరుగనుంది.  బలాబలాపరంగా చూస్తే ఇరు జట్లలోనూ సమర్థవంతమైన  ఆటగాళ్లకు కొదవలేదు.  ఆటగాళ్లతో పాటు   మ్యాచ్  చూసే కోట్లాది అభిమానులకు  అసలైన క్రికెట్ మజా మరో అరగంటలో మొదలుకానుంది. 


 






తుది జట్లు : 


భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా 


పాకిస్తాన్ : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది 


లైవ్ చూడటం ఎలా..? 


- ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించాలంటే  టెలివిజన్ ‌లో అయితే స్టార్ నెట్వర్క్   హిందీ, ఇంగ్లీష్‌తో  పాటు స్థానిక  భాషలలోని తన ఛానెళ్లలో కూడా ప్రసారం చేస్తున్నది.  


- మొబైల్స్‌లో అయితే   డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో  ఉచితంగానే వీక్షించొచ్చు. 


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial