IND vs PAK, Asia Cup 2023: నాలుగేండ్ల తర్వాత వన్డేలలో  తొలిసారి తలపడుతున్న భారత్ - పాకిస్తాన్  మ్యాచ్ కోసం   ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్ అభిమానులు అమితాసక్తితో  ఎదురుచూస్తున్నారు. అయితే  నేటి మ్యాచ్ జరుగబోయే శ్రీలంకలోని క్యాండీ  (పల్లెకెలె)లో  వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని  వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.   ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ వెదర్‌మెన్‌గా మారి  కీలక అప్డేట్ ఇచ్చాడు. 


నేటి  మ్యాచ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించబోతున్న వసీం అక్రమ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘చాలా మంది నన్ను  పల్లెకెలెలో వాతావరణం ఎలా ఉంది అని అడుగుతున్నారు.   ప్రస్తుతానికి నేను ఉన్న హోటల్ పల్లెకెలె స్టేడియానికి కొద్దిదూరంలోనే ఉంది.  అక్కడ్నుంచి నా హోటల్‌కు గంట  ప్రయాణం. ఇక్కడైతే వాతావరణం   చాలా  బాగుంది. కొద్దిగా మేఘాలు కప్పి ఉన్నాయి.   మ్యాచ్ జరిగే పల్లెకెలెలో బహుశా భిన్నమైన వాతావరణం ఉండొచ్చు..’అని  అక్రమ్ వీడియోలో తెలిపాడు. 


మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా అభిమానులు క్రికెట్ ‌ను ఎంజాయ్ చేయాలని  ఈ దిగ్గజం సూచించాడు.   ఇరు జట్లకూ శుభాకాంక్షలు చెప్పిన అక్రమ్..   ఆట అంటే ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడుతారని ఆటను ఆస్వాదించాలని  తెలిపాడు.  


 






స్థానిక వాతావరణ సమాచారం ప్రకారం మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నా అదేం పూర్తిగా మ్యాచ్‌ను తుడిచిపెట్టుకుపోయేంత స్థాయిలో ఉండదని, కానీ కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించొచ్చునని  నివేదికల ద్వారా తెలుస్తున్నది.  నేటి సాయంత్రం వరకూ వర్షం కురిసే అవకాశాలు  60 శాతం వరకూ ఉండటం ఆందోళనకరమే అయినా అందుకు  క్యాండీ  స్టేడియం గ్రౌండ్ సిబ్బంది కూడా  సర్వం సిద్ధంగా ఉన్నారు. 


మ్యాచ్‌ వివరాలు.. 


- శనివారం మధ్యాహ్నం 3 గంటలకు  క్యాండీలోని పల్లెకెలె వేదికగా  మ్యాచ్ జరుగనుంది. 


లైవ్ చూడటం ఎలా..? 


- ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించాలంటే  టెలివిజన్ ‌లో అయితే స్టార్ నెట్వర్క్   హిందీ, ఇంగ్లీష్‌తో  పాటు స్థానిక  భాషలలోని తన ఛానెళ్లలో కూడా ప్రసారం చేస్తున్నది.  


- మొబైల్స్‌లో అయితే   డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో  ఉచితంగానే వీక్షించొచ్చు. 
 
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా 


పాకిస్తాన్ : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial